CM KCR: ప్రభుత్వ చట్టాలు, పథకాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యత కావాలి: సీఎం కేసీఆర్
- ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండరాదు
- రాష్ట్రం ఏర్పడిన తక్కువ కాలంలోనే ప్రగతి సాధించాము
- ప్రభుత్వ నిర్ణయాలను అధికారులు అమలు చేయాలి
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయివుండాలని ప్రగతిభవన్ లో జరిగిన కలెక్టర్ల సదస్సులో తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సదస్సులో మంత్రులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, జీహెచ్ఎంసీ మేయర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలవుతోన్న పంచాయతీ రాజ్, పురపాలక చట్టాలతో పాటు కొత్తగా వస్తోన్న రెవెన్యూ చట్టంపైన కూడా సదస్సులో చర్చించారని తెలుస్తోంది.
కలెక్టర్లు ప్రభుత్వ పథకాలను అమలు చేయాలే తప్ప వ్యక్తి గత ప్రాధాన్యతలు ఉండరాదని సీఎం కేసీఆర్ అన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఫేస్ బుక్ మాధ్యమంగా వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా తక్కువ వ్యవధిలోనే అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించామని సీఎం అన్నారని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాల అమలు తీరును ఆయన వివరించారని పేర్కొంది.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలి తప్ప, ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండరాదని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లకు ఉద్బోధించారు. విస్తృత మేధోమధనం, అనేక రకాల చర్చోపచర్చలు, అసెంబ్లీలో విస్తృత చర్చ-విషయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెస్తుందని, నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం అన్నారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం ఆవలంబిస్తున్న మన దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యత కావాలని చెప్పారు.