Excise super-in-tendent: ఏపీ ఎక్సైజ్ ఉన్నతాధికారిణికి వేధింపులు..‘దిశ’ యాప్ కు సమాచారం
- ఏలూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు వేధింపులు
- విశాఖ - విజయవాడకు బస్సులో వెళుతుండగా ఘటన
- ‘దిశ’ SOS ద్వారా పోలీసులకు సమాచారమిచ్చిన అధికారిణి
ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ యాప్ ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్ ను ఆశ్రయించిన ఓ మహిళకు తక్షణ సాయం అందింది. పశ్చిమగోదావరిలోని ఏలూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఓ పోకిరీ వేధింపుల బారినపడ్డారు. ఆమె విశాఖపట్టణం నుంచి విజయవాడకు బస్సులో వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
బస్సులో ఆమె సీటు వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దీంతో, ఆమె తన మొబైల్ ఫోన్ లో ఉన్న ’దిశ’ SOS ద్వారా పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ సమాచారం వెంటనే ఏలూరు త్రీ టౌన్ పోలీసులకు చేరడంతో కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే బస్సు దగ్గరకు పోలీసులు చేరుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేశారు. కాగా, గౌరవప్రదమైన ఉపాధ్యాయవృత్తిలో నిందితుడు ఉన్నట్టు సమాచారం.