Botsa Satyanarayana Satyanarayana: గురజాడ అప్పారావు గారు ఎప్పుడో చెప్పారు: బొత్స
- టీడీపీ నేతలపై బొత్స ధ్వజం
- రాష్ట్ర ప్రజలంటే తెలుగుదేశం పార్టీ వాళ్లు మాత్రమే కాదన్న బొత్స
- టెంట్ల కింద కూర్చున్నవాళ్లే రైతులా? అంటూ ఆగ్రహం
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ నేతలపై మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజలంటే టీడీపీ నేతలు, టీడీపీ ప్రజాప్రతినిధులే కాదని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు ప్రజలేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు ఏ ఒక్క ప్రాంతానికో, ఏ ఒక్క సామాజిక వర్గానికో ఉద్దేశించినవి కావని అన్నారు. ఉత్తరాంధ్రలో అయ్యన్నపాత్రుడు ఒక్కడే ప్రజాప్రతినిధా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ నిర్ణయాలు టీడీపీ నేతలకు, చంద్రబాబు తాబేదార్లకు అక్కర్లేకపోవచ్చని, కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రమంటే 13 జిల్లాలు అని అన్నారు.
'దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్' అని గురజాడ అప్పారావు గారు ఎప్పుడో చెప్పారని ఈ సందర్భంగా బొత్స వ్యాఖ్యానించారు. అక్కడ టెంట్ల కింద కూర్చుని ఉన్నవాళ్లే రైతులు, ఇంకెవరూ రైతులు కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నాడని, కానీ మీకెవరిచ్చారని అర్ధరాత్రి పూట హైదరాబాద్ నుంచి విజయవాడ పరిగెత్తుకొచ్చారు? అంటూ బొత్స నిలదీశారు. 'తెలంగాణ ప్రభుత్వం ఓటుకు నోటు కేసులో చర్యలు తీసుకుంటుందన్న భయంతో దొంగలా పారిపోయి వచ్చావు. మేం అలా చేయలేదే. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకున్నాం, ప్రజలందరికీ చెప్పాం, మూడు కమిటీలు కూడా వేశాం' అంటూ వ్యాఖ్యానించారు.