Anchor Suma: యాంకర్లు అప్పట్లో లేరు.. అనౌన్సర్లు మాత్రమే ఉండేవారు: తన యాంకరింగ్ ప్రస్థానం గురించి వివరించిన సుమ

  • నా తొలి స్టేజ్ షో ‘పుత్ర కామేష్టి’
  • దూరదర్శన్ కోసం తొలి యాంకరింగ్ షో
  • సినిమాల్లో నటించాను.. కానీ, టీవీ షోలే నచ్చాయి

తన అద్భుత యాంకరింగ్ తో  ప్రజాదరణను పొందిన యాంకర్ సుమ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అనర్గళమైన వాక్పటిమతో అటు టీవీ షోలు, సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లలో సందడిగా మాట్లాడే సుమ తన కెరీర్ కు సంబంధించి వివరాలను ఇటీవల ‘సమ్మక్క’ యూట్యూబ్ ఛానల్ మాధ్యమంగా వెల్లడించారు. యాంకరింగ్ కెరీర్ కంటే ముందు తాను నృత్యం, సీరియల్స్, స్టేజ్ ప్రోగ్రాంలు చేసేదాన్నని సుమ తెలిపారు. తొలిసారిగా తాను స్టేజ్ పై నటించిన షో ‘పుత్రకామేష్టి’ ( కొడుకు పుట్టాలి) అంటూ.. ఇందులో తాను  కొరలమ్మ పాత్ర చేశానని చెప్పారు.ఢిల్లీ, కోల్ కతాలలో రైల్వేస్ నిర్వహించిన కార్యక్రమాల్లో తనకు ఉత్తమ నటి అవార్డు వచ్చిందన్నారు. తన మెమరీ పవర్ ను పెంచడానికి ఈ నాటకాలు బాగా ఉపకరించాయని ఆమె చెప్పారు. తాను కేరీర్ ప్రారంభించిన సమయంలో యాంకరింగ్ అన్న పదమే లేదని చెప్పారు. అనౌన్సర్లు ఉండేవారంటూ.. దూరదర్శన్ కార్యక్రమాలు చేస్తూండగా, ‘ఇక్కడ మాట్లాడలమ్మా’ అని తనకూ సూచిస్తుండేవారని సుమ వెల్లడించారు. అంతేకాని మీరు యాంకరింగ్ చేయాలి అని చెప్పేవారు కాదని ఆమె పేర్కొన్నారు. తన యాంకరింగ్ కు స్ఫూర్తి ఎవరన్న విషయం తెలియకుండానే.. కార్యక్రమాలు చేయటం ప్రారంభించానన్నారు. అలా  అదే వృత్తిగా మారిందన్నారు. అప్పుడు యాంకరింగ్ చేసేవాళ్లు కార్యక్రమం తర్వాత డబ్బింగ్ చెప్పాల్సి వచ్చేదని, ఇప్పుడు యాంకరింగ్ చేసేవాళ్ల కోసం పలు రకాల మైక్ లున్నాయన్నారు. అప్పటి కష్టమేంటో తమకు మాత్రమే తెలుసన్నారు.  
నా తొలి దశ యాంకరింగ్

‘నేను తొలిసారిగా చేసిన యాంకరింగ్ లేదా ఫిలిం ఆధారిత ప్రోగ్రాం.. దూరదర్శన్ కోసం చేశాను. ఆ ప్రోగ్రాం బషీర్ బాగ్ లోని త్రీ స్టార్ ఎలక్ట్రానిక్స్ స్టూడియోలో షూటింగ్ జరిగింది. దానికి మీర్ గారు దర్శకత్వం చేశారు. నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం నేను కొంతమందితో కలిసి పనిచేసిన టెక్నీషియన్లు, డైరెక్టర్లు, కెమెరా మెన్ తోపాటు, బ్రిమ్ అనే రచయిత, ప్రదీప్, రామ్ ప్రసాద్.. ఇలా చాలామంది ఉన్నారు. నేను మలయాళిని. నా తెలుగును సంస్కరించినవారు కూడా వారే.

మలయాళంలో ఏసియా నెట్ ఛానల్ వచ్చింది. అందులో  రెండు గంటల నిడివితో తెలుగు కార్యక్రమం పెట్టారు. దానికోసం జీకే మోహన్ గారు, హేమంత్, గీత, అను.. వీరంతా  చిన్న చిన్న ప్రోగ్రాంలు చేసేవారు. బయటకు వెళ్లి చీరల షాపుల్లో ఏం దొరుకుతుంది? అన్న వివరాలను తెలిపే కార్యక్రమం. ఆ కార్యక్రమంలో వారితో కలిసి చేశాను. అనంతరం జయ, పుష్పతో కలిసి ఫిలిం ఆధారిత ప్రోగ్రాం కోసం యాంకరింగ్ బిట్స్ చేశాము. వాటిని పాటలతో  కలిపి వీడియోగా రిలీజ్ చేశారు. ఇవన్నీ తొలిదశలో శాటిలైట్ బూమ్ రాకముందు నేను చేసిన యాంకరింగ్’ అని సుమ చెప్పారు. 
 టీవీ షోలే సౌకర్యమనిపించాయి

‘అనంతరం జెమినీ, ఈ టీవీలు వచ్చాయి. ఉత్తరాదిన హోస్ట్, యాంకరింగ్ అన్న పదాలు వినిపిస్తూండేవి. వాటిని మెల్లిగా ఇక్కడకు కూడా తీసుకొచ్చారు. జెమినీలో తొలిసారిగా నేను చేసిన యాంకరింగ్ షో ‘వన్స్ మోర్ ప్లీజ్’. దీనికి కూడా నేను డబ్బింగ్ చెప్పేదాన్ని. దూరదర్శన్ కోసం ఓ క్విజ్ కార్యక్రమంలో క్విజ్ మాస్టర్ గా అచ్యుత్ గారు ఉండగా, నేను ఒక  హోస్ట్ గా చేశాను. కొన్ని కారణాల వల్ల నేను ఆ కార్యక్రమం నుంచి విరమించగా కొత్తగా అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన ఝాన్సీ నా స్థానాన్ని పొందారు.

అనంతరం జెమీనీ టీవీలో ‘టాప్ ఆఫ్ ద టాప్స్’ అనే షో చేశాను. ఈ షోలో వేరువేరు గెటప్స్ వేయడంతో, వేరువేరు యాసలు, ప్రవర్తనలు అలవాటయ్యాయి. అదే సమయంలో రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేశాను. ఒకటి దాసరి నారాయణరావు దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు.. మలయాళంలో మూడు సినిమాల్లో చేశాను. కానీ టీవీ షోలే.. నాకు సౌకర్యంగా అనిపించింది’ అన్నారు.
‘అవాక్కయ్యారా’ అతి పెద్ద మలుపు

జెమినీలో ‘అంత్యాక్షరీ’ కార్యక్రమంకు ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండంగా ఆదరణ వచ్చింది. నేను, సంగీత దర్శకుడు శ్రీ కలిసి హోస్ట్ లుగా చేశాము. తర్వాత ఈటీవీలో ‘కోకాకోలా హంగామా’ అనే షో కూడా చేశాను. దీనిలో కూడా నాకు మంచి పేరు వచ్చింది. ఈ రెండు ఛానళ్ల తర్వాత మాటీవీ లో ‘యురేకా కసా మిసా’, ‘గుర్తుకొస్తున్నాయి’ కార్యక్రమాలు చేశా. సుమారు 72 షోలు చేశాం.

2006లో అదే ఛానల్లో  ‘అవాక్కయ్యారా’ అనే కార్యక్రమం నా కెరీర్ లో పెద్ద మైలురాయి. మధ్యాహ్న సమయంలో టెలీకాస్ట్ అయిన ఈ షోకు ఇంత ప్రజాదరణ వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఈ షో తర్వాత అన్ని విధాల స్థిరపడ్డాను. నా కెరీర్ లో చేసిన అతిపెద్ద మహిళల గేమ్ షో ‘మహిళలు.. మహారాణులు’ పేరుతో ప్రారంభమైన ఈ షో అనంతరం ‘స్టార్ మహిళ’గా మారింది. 12 ఏళ్లు నడిచిన ఏకైన మహిళా గేమ్ షోగా అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది’ అని సుమ చెప్పుకొచ్చారు.
 ప్రేక్షకులకు బాగా నచ్చిన షో ‘పంచావతారం’!

 ‘యాంకరింగ్ చేసేటప్పుడు మన మనసు కూడా అక్కడే ఉండాలన్నది ప్రధానం.  అనంతరం చాలా గేమ్ షోలు వచ్చాయి. మంచి ఆసక్తి కలిగిన గేమ్స్ షోలను తెలుగువారికోసం తీసుకొచ్చిన ఘనత మల్లెమాల వారికి దక్కుతుంది. అందులో ‘జీన్స్’ , ‘క్యాష్’ వంటివి వచ్చాయి. నాకు, ప్రేక్షకులకు బాగా నచ్చిన మరో షో ‘పంచావతారం’. ఇది టీవీ9 లో చేసే దాన్ని.  భలేఛాన్సులే అన్న షో కూడా అందరినీ అలరించింది. వీటితోపాటు, ‘లక్కు..కిక్కు’, ‘కెవ్వు కేక’, ‘ఎఫ్ 3’, ‘బంపర్ ఆఫర్’, ‘లేడీ బాస్’.. ఇలా వేరు వేరు షోలు చేస్తున్నాను. వీటితో ప్రి రిలీజ్ లు కూడా చేస్తున్నాను వాటి గురించి మరో ప్రత్యేక బ్లాగ్ లో వివరిస్తాను.. యాంకరింగ్ లో ఇప్పటికీ నేను తెలుగును నేర్చుకుంటున్నాను. యాంకరింగ్ లో చాలామంది మాట్లాడేస్తే అయిపోతుందని అనుకుంటారు. కాని భాషమీద పట్టు, చదవటం, రాయటం వచ్చి ఉండాలి. అది నాకు నేర్పించిన మా అమ్మకు శతకోటి వందనాలు’ అని సుమ చెప్పారు.




  • Loading...

More Telugu News