Madhavi latha: నాపై రెండు రోజులకోసారి ట్రోల్ చేస్తూనే ఉంటారు: సినీ నటి మాధవీలత
- ‘క్యారెక్టర్ అసాసినేషన్’ చేస్తూ రాస్తారు
- చెప్పలేని పదాలను వాడుతూ పోస్ట్స్ చేస్తారు
- రియాక్ట్ అవకపోతే ఇంకా విచ్చలవిడిగా రాసేస్తారు
సామాజిక మాధ్యమాల వేదికగా సెలెబ్రిటీలను ట్రోలింగ్ చేస్తూ కామెంట్స్ చేయడం పరిపాటైంది. ముఖ్యంగా, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు ట్రోలింగ్ బాధ తప్పట్లేదు. బీజేపీ మహిళా నేత, ప్రముఖ సినీ నటి మాధవీలత స్పందిస్తూ తన ట్రోలింగ్ అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. రెండు రోజులకోసారి తనను ట్రోల్ చేస్తూ పోస్ట్స్ వస్తూ వుంటాయని చెప్పారు.
‘క్యారెక్టర్ అసాసినేషన్’ చేస్తూ రాస్తారని, సినిమా రంగంలో ఉండటం ఒక నేరంగా, రాజకీయాల్లో ఉండటం మరో నేరంగా భావిస్తూ, ఈ రెండింటిని ‘లింక్ అప్’ చేస్తూ ట్రోల్ చేస్తున్నారని అన్నారు. పబ్లిక్ లైఫ్ లో ఉన్న తమ క్యారెక్టర్ల గురించి వ్యాఖ్యలు చేయడాన్ని తమ హక్కుగా భావిస్తారని ఇలా ట్రోల్ చేసే వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
‘ఇలా ఎందుకు రాస్తారు?’ అని తిరిగి పోస్ట్ కనుక పెడితే, ‘మీకు మీరు సెలెబ్రిటీస్ అని, లీడర్స్ అని ఫీలవుతున్నారా?’ అంటూ చెప్పలేని పదాలను వాడుతూ పోస్ట్ లు చేస్తున్నారని అన్నారు. ఇలాంటివి తేలికగా తీసుకోవచ్చు కానీ, ఏదో ఒక సందర్భంలో అలాంటి వ్యాఖ్యలు బాధపెడతాయని, రియాక్ట్ అవకపోతే విచ్చలవిడిగా రాసేస్తూ ఉంటారని చెప్పారు.