SC/ST Amendment Act: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ముందస్తు బెయిల్ కు నో.. సవరణ చట్టానికి సుప్రీం సమర్థన!

  • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ అమెండ్ మెంట్ యాక్ట్-2018కి మద్దతు
  • ఎఫ్ఐఆర్ దాఖలుకు ముందు ప్రిలిమినరీ ఎంక్వైరీ అవసరం లేదని వ్యాఖ్య 
  • 2018లో తాము ఇచ్చిన తీర్పు అమలు నిలిపివేత

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆ కేసుల్లో ఎలాంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండానే ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ అమెండ్ మెంట్ యాక్ట్-2018ను సమర్థించింది.

దీనిపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ప్రాథమిక విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం, అరెస్టులు చేయడం వద్దంటూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. ఇప్పుడీ సవరణ చట్టం, కోర్టు తాజా ఆదేశాలతో రద్దవుతోంది.

ఏంటీ వివాదం?

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం అవుతోందని, కావాలనే కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన సుప్రీంకోర్టు 2018లో పలు ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం అవుతోందన్న వాదనను సమర్థించింది. దాని కింద వచ్చే ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

కేసు మెరిట్ ను బట్టి ముందస్తు (యాంటిసిపేటరీ) బెయిల్ మంజూరు చేయవచ్చని పేర్కొంది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని, దానిని పున: పరిశీలించాలని కోరుతూ పెద్ద ఎత్తున రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ తీర్పును రివ్యూ చేయాలని కోరింది. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టానికి సవరణలు చేసింది. ఈ మేరకు జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. తాజాగా సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News