Muthyala Subbaiah: మా ఊరివాళ్లు ఉన్నారనే ధైర్యంతోనే అప్పట్లో చెన్నై వెళ్లాను: దర్శకుడు ముత్యాల సుబ్బయ్య
- మాది వ్యవసాయ కుటుంబం
- నాటకాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది
- అత్తెసరు మార్కులతో డిగ్రీ పూర్తి చేశానన్న సుబ్బయ్య
దర్శకుడు ముత్యాల సుబ్బయ్య పేరు వినగానే 'మామగారు' ..'కలికాలం' .. 'ఎర్ర మందారం' .. 'హిట్లర్' .. 'పవిత్రబంధం' వంటి సూపర్ హిట్ సినిమాలు కళ్లముందు కదలాడతాయి. వినోదం .. సందేశం కలగలిసిన కథలను తెరపై ఆవిష్కరించి, ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.
అలాంటి ముత్యాల సుబ్బయ్య తాజాగా ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "నేను ప్రకాశం జిల్లా కె.బిట్రగుంట గ్రామంలో పుట్టిపెరిగాను. మా నాన్న శంకరయ్య .. మా అమ్మ శేషమ్మ .. మాది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. మొదటి నుంచి నాకు నాటకాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. కాలేజ్ రోజుల నాటికి నాటకాలపై ఆసక్తి మరింతగా పెరుగుతూ వచ్చింది. అత్తెసరు మార్కులతో డిగ్రీ పూర్తి చేశాను. మా ఊరి వాళ్లు కొందరు చెన్నైలో హోటల్స్ నడుపుతుండేవారు. అక్కడ ఉంటూ సినిమాల్లో ట్రై చేయవచ్చనే ఉద్దేశంతో వెళ్లాను. వాళ్లు ఆశ్రయం ఇవ్వడం వలన, నేను అనుకున్నది సాధించగలిగాను" అని చెప్పుకొచ్చారు.