Cellphone driving: ఇక ఫోన్ చేస్తూ డ్రైవ్ చేస్తే సరాసరి జైలుకే!
- పెరుగుతున్న సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు
- ఢిల్లీలో అత్యధికం, ఆ తర్వాతి స్థానంలో ముంబై
- తీవ్రంగా పరిగణిస్తున్న న్యాయస్థానాలు
హైదరాబాదులో మొబైల్‌లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్న వారి సంఖ్యతోపాటు, ఆ కారణంగా జరుగుతున్న ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం మాత్రం ఉండడం లేదు. దీంతో మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు.
ఇందులో భాగంగా ఇకపై ఫోన్ డ్రైవింగ్‌కు జైలు శిక్ష విధించాలని యోచిస్తున్నారు. ఇటువంటి కేసులను కోర్టులు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. జరిమానాతోపాటు జైలు శిక్షలు కూడా విధిస్తున్నాయి. మరోవైపు, ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్న వారిని పట్టుకునేందుకు సీసీ టీవీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
గత నెల తొలి 15 రోజుల్లో 63 కూడళ్లు, రహదారుల్లో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్న వారిని గుర్తించారు. బైకర్లలో 80 శాతం మంది, కారు డ్రైవర్లలో 40 శాతం మంది సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. ఇక, ఇటువంటి వారి సంఖ్య ముంబైలో చాలా ఎక్కువగా ఉంది. సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసుల్లో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో ముంబై ఉంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2018లో 14,686, గతేడాది 22,190 కేసు నమోదు కాగా, జనవరిలో 2284 కేసులో నమోదయ్యాయి.