IRAN: ఇరాన్ శాటిలైట్ ప్రయోగం 'విక్టరీ' సాధించలేదు!
- ఆదివారం రాత్రి ప్రయోగం
- చివర్లో మందగించిన వేగం
- లక్ష్యాన్ని చేరుకోలేకపోయిన రాకెట్
తాము ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించామని, అయితే, అది కక్ష్యలోకి మాత్రం చేరుకోలేదని ఇరాన్ ప్రకటించింది. గ్రౌండ్ పై ఉండే రాడార్ వ్యవస్థలకు అనుసంధానంగా ఉండేందుకు తయారు చేసిన 'విక్టరీ' అనే ఈ శాటిలైట్ ను నింగిలోకి పంపించగలిగామని, అయితే నిర్దేశిత కక్ష్యలోకి అది చేరుకోలేదని వెల్లడించింది.
ఇరాన్ లో పార్లమెంట్ ఎన్నికలు జరిగేందుకు కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలివున్న ఈ తరుణంలో ఉపగ్రహ ప్రయోగం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరాన్ కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 7.15 నిమిషాలకు శాటిలైట్ ను రాకెట్ తీసుకెళ్లిందని ప్రకటించిన రక్షణ శాఖ, చివరకు రాకెట్ వేగం మందగించిన కారణంగా, లక్ష్యాన్ని చేరుకోలేదని వెల్లడించింది.
భవిష్యత్తులో జరిగే ప్రయోగాల్లో మరింత పురోగతిని సాధిస్తామని, ఈ మిషన్ ను పూర్తి చేస్తామని తెలిపింది. అంతరిక్షంలోకి శాటిలైట్లను పంపేందుకు కొత్త తరం రాకెట్ ఇంజన్ లను తయారు చేస్తున్నట్టు పేర్కొంది. గతంలో శాటిలైట్లను తీసుకువెళ్లిన రాకెట్లతో పోలిస్తే, ఇవి తక్కువ బరువుతో వుంటాయని తెలిపింది.