Delhi: ఎట్టకేలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం ప్రకటించిన ఈసీ
- పోలింగ్ నిన్న జరిగితే ఇవాళ ఓటింగ్ శాతం వెల్లడించిన ఈసీ
- మొత్తం 62.59 శాతం నమోదైందని వెల్లడి
- సరిగా నిర్ధారించుకునే క్రమంలో ఆలస్యమైందన్న ఈసీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిన్న జరిగిన సంగతి తెలిసిందే. అయితే, పోలింగ్ ముగిసి గంటలు గడుస్తున్నా ఎన్నికల సంఘం పోలింగ్ శాతం ప్రకటించకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం పోలింగ్ పర్సంటేజీ వెల్లడించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ స్పందించింది. ఎట్టకేలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. ఓటింగ్ శాతాన్ని సరిగా నిర్ధారించుకునే క్రమంలో పలు పర్యాయాలు పరిశీలన జరిపామని, అందుకే ఆలస్యం అయిందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఢిల్లీ ఎన్నికల్లో మొత్తమ్మీద 62.59 శాతం ఓటింగ్ నమోదైనట్టు వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం పరిశీలనకు అదనపు సమయం పట్టిందని ఎన్నికల ముఖ్య అధికారి రణబీర్ సింగ్ తెలిపారు.