Under-19: వెంటవెంటనే 4 వికెట్లు తీసి భారత్ కు ఆశలు కల్పించిన రవి బిష్ణోయ్
- ఆసక్తికరంగా సాగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్
- లక్ష్యఛేదనలో అనూహ్యంగా కష్టాలపాలైన బంగ్లాదేశ్
- బంతితో బెంబేలెతిస్తున్న రవి బిష్ణోయ్
క్రికెట్ లో ఎప్పుడు ఎలా మారిపోతుందో చెప్పలేం! అండర్-19 వరల్డ్ కప్ లో టీమిండియా నిర్దేశించిన 178 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ ఓ దశలో 50 పరుగుల వరకు వికెట్ కోల్పోలేదు. దాంతో ఫైనల్లో భారత్ కు భంగపాటు తప్పదన్న భావన అందరిలోనూ కలిగింది. కానీ పరిస్థితి మారడానికి ఎంతో సమయం పట్టలేదు. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు తీసి బంగ్లాదేశ్ ను ఒత్తిడిలోకి నెట్టాడు.
క్రీజులో పాతుకుపోయిన టాంజిద్ హసన్ (25)ను అద్భుతమైన బంతితో పెవిలియన్ చేర్చిన రవి... ఆ తర్వాత సూపర్ ఫామ్ లో ఉన్న హసన్ జాయ్ (8) ను మరో సూపర్ బాల్ తో బౌల్డ్ చేసి భారత శిబిరంలో ఆశలు నింపాడు. తన మరుసటి ఓవర్లోనే తౌహిద్ హృదయ్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న రవి మూడో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆపై షహాదత్ హుస్సేన్ ను సైతం తానే అవుట్ చేశాడు. కాగా, ధాటిగా ఆడుతున్న బంగ్లాదేశ్ ఓపెనర్ పర్వేజ్ హుస్సేన్ ఇమాన్ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 16 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. విజయానికి 34 ఓవర్లలో 113 పరుగులు చేయాల్సి ఉండగా, భారత్ గెలుపుకు 7 వికెట్లు అవసరం.