Ramoji Rao: రామోజీ గ్రూప్ పై కేరళ సీఎం ప్రశంసల వర్షం
- 2018లో కేరళను ముంచెత్తిన వరదలు
- సర్వస్వం కోల్పోయిన లక్షలాది ప్రజలు
- బాధితులకు ఇళ్లు నిర్మించి ఇచ్చిన రామోజీ గ్రూప్
రెండేళ్ల క్రితం సంభవించిన భారీ వరదలతో కేరళ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డ్యాములు పొంగిపొర్లడంతో కేరళలో ఎక్కడ చూసినా వరద బీభత్సం నెలకొంది. భారీగా జననష్టం, ఆస్తినష్టం సంభవించింది. అనేక దేశాల ప్రజలు కూడా కేరళ పరిస్థితి పట్ల చలించిపోయి ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వచ్చారు.
ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన మీడియా దిగ్గజం రామోజీరావు కేరళ వరద బాధితుల కోసం ఇళ్ల నిర్మాణానికి సంకల్పించడమే కాదు, అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేశారు. రామోజీరావుకు చెందిన రామోజీ గ్రూప్ గూడు కోల్పోయిన నిరాశ్రయుల కోసం నూతన ఇళ్ల నిర్మాణం చేపట్టి పూర్తిచేసింది. రూ.3 కోట్లతో ఈనాడు సహాయనిధిని ఏర్పాటు చేయడంతోపాటు, ఇతర దాతలు అందించిన మొత్తం కలిపి రూ.7.77 కోట్లతో అలెప్పీ జిల్లాలో ఇళ్లు నిర్మించారు.
ఆదివారం అలెప్పీలో జరిగిన ఓ కార్యక్రమంలో 121 మంది లబ్దిదారులకు సీఎం విజయన్ చేతులమీదుగా తాళాలు ఇప్పించారు. ఈ సందర్భంగా విజయన్ రామోజీ గ్రూప్ పై అభినందల వర్షం కురిపించారు. బాధితులను ఆదుకోవడంలో కేరళ ప్రభుత్వం కంటే రామోజీ గ్రూప్ ఎక్కువగా తపించిపోయిందని, ఆపన్నులకు చేయూతనివ్వడంలో రామోజీ గ్రూప్ సంకల్పం ఎంతో బలమైనదని కొనియాడారు. వారి సంకల్ప బలం వల్లే ఇవాళ నూతన గృహాల అందజేత కార్యక్రమం నిర్వహించుకోగలుగుతున్నామని విజయన్ కొనియాడారు.