Kathi Mahesh: మరో వివాదంలో కత్తి మహేశ్... పోలీసు కేసు నమోదు!

  • రాముడి ఫేవరెట్ డిష్ జింక మాంసం
  • అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసు
  • గతంలో నగర బహిష్కరణను ఎదుర్కొన్న కత్తి మహేశ్

వివాదాస్పద విమర్శకుడు కత్తి మహేశ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. శ్రీరామునిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందగా, ఐపీసీ సెక్షన్ 502 కింద కేసు నమోదు చేశారు. కాగా, ఇటీవల ఆయన మాట్లాడుతూ, శ్రీరాముని ఫేవరెట్ వంటకం జింక మాంసమని, సీతా దేవి జింకను తీసుకుని రమ్మని కోరింది వండుకుని తినడానికేనని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాముడి అంతఃపురంలో చాలామంది వేశ్యలు ఉండేవారని కూడా అన్నారు.

కత్తి మహేశ్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. పలువురు నెటిజన్లు, సోషల్ మీడియా వేదికగా మహేశ్ పై విమర్శల వర్షం కురిపించారు. అయినా, మహేశ్ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. తాను భయంకరమైన హిందువునని, దేన్నీ గుడ్డిగా ఫాలో కాబోనని, వాల్మీకి రామాయణ అనువాదంలోని ఉత్తర కాండలో ఉన్న 42 సర్గ, 18 నుంచి 22 వరకూ వచనాలు, యుద్ధకాండంలోని వచనాలు చూడాలని సమాధానం ఇచ్చారు. కాగా, 2018లోనూ రాముడిపై కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేయగా, ఆరు నెలల పాటు హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తున్నట్టు అప్పట్లో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Kathi Mahesh
Lord Ram
Police
Case
  • Error fetching data: Network response was not ok

More Telugu News