Vegetables: చాలా తక్కువ రేట్లకే కూరగాయలు... ఏదైనా రూ. 20 నుంచి రూ.40 లోపే!

  • దారుణంగా పడిపోయిన ధరలు
  • గిట్టుబాటు ధర రావడం లేదని రైతుల గగ్గోలు
  • మరింతగా తగ్గుతాయంటున్న వ్యాపారులు

హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు దారుణంగా పడిపోయాయి. ఈ సీజన్ లోనే అతి తక్కువ ధరలకు కూరగాయలు లభిస్తున్నాయి. గడచిన మూడు నెలలతో పోలిస్తే, ప్రస్తుతం ఏదైనా కిలోకు రూ. 20 నుంచి రూ. 40 మధ్యే లభిస్తోంది. వాస్తవానికి సెప్టెంబర్ నుంచి మార్చి మధ్య దిగుబడి అధికంగా ఉండి కూరగాయల ధరలు అందుబాటులో ఉంటాయి. ఈ సంవత్సరం జనవరి వరకూ చాలా కూరగాయల ధరలు ఆకాశంలోనే ఉన్నాయి. ముఖ్యంగా ఉల్లిపాయలు, బంగాళాదుంపల ధరలు చుక్కలు చూపాయి.

కానీ, ఇప్పుడు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. వంకాయ, చిక్కుడు, బెండకాయ తదితరాల ధరలు కిలో రూ. 40 వరకూ పలుకుతుండగా, టమోటా ధర కిలోకు రూ. 10 వరకూ పలుకుతోంది. మహబూబ్ నగర్, వికారాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు భారీగా కూరగాయల దిగుమతి అవుతూ ఉండటమే ఇందుకు కారణమని వ్యాపారులు అంటున్నారు.

నిన్నమొన్నటి వరకూ కిలోకు రూ. 60 నుంచి రూ. 80 వరకూ ఉన్న ధరలు, ఇప్పుడు సగం వరకూ తగ్గాయి. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింతగా తగ్గుతాయని అంచనా. నగరంలోని పలు మార్కెట్లకు కూరగాయలను తీసుకుని వచ్చిన రైతులు, తమకు గిట్టుబాటు ధర లభించడం లేదని వాపోతున్న పరిస్థితి. తెలంగాణలో నీటి లభ్యత పెరగడంతోనే రైతులు కూరగాయలను అధికంగా పండిస్తున్నారని, ఈ పంట మొత్తం జనవరి 2వ వారం తరువాత చేతికి అందడంతోనే ధరలు తగ్గాయని తెలుస్తోంది.

ఇక శనివారం నాడు వివిధ మార్కెట్లలో కూరగాయల ధరలను పరిశీలిస్తే, కిలో టమోటా, క్యాబేజీ రూ. 10, వంకాయ రూ. 20, బెండకాయ, కాకరకాయ, బీరకాయ, గోకరకాయ రూ. 25, పచ్చిమిర్చి రూ. 30, దోసకాయ, పొట్లకాయ, దొండకాయ రూ. 20, బీట్ రూట్ రూ. 15, సొరకాయ రూ. 10, కాలీఫ్లవర్ రూ. 15పై అమ్మకాలు సాగుతున్నాయి.

Vegetables
Price Down
Market
Telangana
  • Loading...

More Telugu News