Medaram: ఉద్విఘ్నంగా సాగిన అమ్మల వన ప్రవేశం... ముగిసిన మేడారం జాతర!
- శనివారం సాయంత్రం 6 గంటలకు దర్శనాల నిలిపివేత
- వన ప్రవేశం చేసిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు
- చివరి రోజున 15 లక్షల మందికి దర్శనం
తెలంగాణ గిరిజన కుంభమేళా అధికారికంగా ముగిసింది. రెండు రోజుల పాటు గద్దెలపై కొలువై కోట్లాది మంది భక్తుల మొక్కులను స్వీకరించిన సమ్మక్క, సారక్క తల్లులు తిరిగి వన ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమం ఉద్విఘ్నంగా సాగింది. అమ్మలు వనంలోకి వెళ్లే దృశ్యాన్ని చూసేందుకు లక్షల మంది భక్తులు బారులు తీరారు. భారీ వర్షంతో ఇబ్బందులు ఎదురైనా, దాదాపు 15 లక్షల మంది భక్తులు, మేడారం జాతర చివరి రోజున అమ్మలను దర్శించుకున్నారు.
ఆదివాసీ సంప్రదాయాలతో శనివారం సాయంత్రం సమ్మక్క చిలకలగుట్టపైకి, సారక్క కన్నెపల్లికి చేరారు. అంతకుముందు సంప్రదాయ పూజలు వైభవంగా జరిగాయి. నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలోనే దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. ఆపై తొలుత గోవిందరాజును గద్దెల నుంచి కదిలించి, ఏటూరునాగారం మండలం కొండాయికి తరలించారు.
ఆ తరువాత కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను పూజారులు చిలుకలగుట్ట వైపు తీసుకెళ్లారు. ఆపై ఆమె భర్త పగిడిద్దరాజును కొత్తగూడమండలం పూనుగొండ్ల వైపు తీసుకెళ్లారు. చివరిగా ముట్టె (వెదురుబుట్ట) రూపంలో గద్దెపై కొలువుదీరిన సారలమ్మను తరలించారు. దీంతో మేడారం మహాజతర ముగియగా, బుధవారం జరిగే తిరుగువారం పండగ వరకూ భక్తులు గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటూనే ఉంటారు.