KIA Motors: 'కియో వెళ్లిపోతోంది' అన్న ట్వీట్ లో పొరబాటు దిద్దుకున్న రాయిటర్స్
- ఏపీలో సంచలనం సృష్టించిన రాయిటర్స్ కథనం
- అధికార, విపక్షాల మధ్య మరింత రాజుకున్న అగ్గి
- తాము వెళ్లిపోవడంలేదని కియా స్పష్టీకరణ
- కియా గురించి తమకు సమాచారం లేదన్న తమిళనాడు వర్గాలు
- ట్వీట్ లో పొరబాటు జరిగిందన్న రాయిటర్స్!
- కథనానికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నామని వెల్లడి
కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతోందంటూ రాయిటర్స్ లో వచ్చిన కథనం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాయిటర్స్ అంతర్జాతీయంగా ఎంతో విశ్వసనీయత ఉన్న మీడియా సంస్థ కావడంతో ఆ కథనం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.
అయితే కియా మోటార్స్ స్పందిస్తూ, తాము ఏపీ నుంచి వెళ్లిపోతున్నామన్నది కట్టుకథ అని, తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నది అవాస్తవం అని స్పష్టం చేయడంతో కథ అడ్డం తిరిగింది. అటు, తమిళనాడు ప్రభుత్వ వర్గాలు కూడా కియా గురించి తమకేమీ సమాచారం లేదని తేల్చిచెప్పడంతో రాయిటర్స్ కథనం విశ్వసనీయతపై సందేహాలు బయల్దేరాయి.
ఈ నేపథ్యంలో, కియా మోటార్స్ పై తాము రాసిన కథనం తాలూకు ట్వీట్ ను తొలగిస్తున్నామని వెల్లడించింది. మొదట తాము కియా వెళ్లిపోతోందంటూ ఓ ట్వీట్ చేశామని, ఆ తర్వాత మరో ట్వీట్ లో ఆంధప్రదేశ్ కు వెళుతున్నట్టుగా పొరబాటున పేర్కొన్నామని, ఆ ట్వీట్ ను తొలగిస్తున్నామని రాయిటర్స్ వెల్లడించింది. అంతేతప్ప తొలగించింది కథనాన్ని కాదని స్పష్టం చేసింది. కియా వెళ్లిపోతోందన్న కథనానికి తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని రాయిటర్స్ ఇండియా ట్విట్టర్ లో వెల్లడించింది.
రాయిటర్స్ మొదట చేసిన ట్వీట్ , ఆ తర్వాత చేసిన సవరణ ట్వీట్ లు ఇవే...