Anil Ambani: నా ఆస్తి విలువ సున్నా... చేతులెత్తేసిన అనిల్ అంబానీ!

  • రిలయన్స్ కమ్యూనికేషన్స్ కోసం చైనా బ్యాంకుల నుంచి రుణాలు
  • వ్యక్తిగత హామీలు సమర్పించిన అనిల్  
  • రుణం రికవరీ కోసం బ్రిటన్ కోర్టును ఆశ్రయించిన చైనా బ్యాంకులు
  • ఆరు రోజుల్లో రూ.700 కోట్లు డిపాజిట్ చేయాలన్న కోర్టు
  • తన పెట్టుబడులన్నీ క్షీణించాయని నిస్సహాయత వ్యక్తం చేసిన అనిల్

ఒకప్పుడు రిలయన్స్ సామ్రాజ్యంలో యువరాజుగా ఖ్యాతిపొందిన అనిల్ అంబానీ కాలక్రమంలో పతనం అంచుల్లోకి జారిపోయారు. ఆస్తులు ఒక్కొక్కటీ చేజార్చుకుంటూ, ఓ దశలో అన్న ముఖేశ్ అంబానీ ఆపన్నహస్తంతో గట్టెక్కారు. ఇప్పుడు మరింత క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నట్టు ఆయన వ్యాఖ్యలే చెబుతున్నాయి.

రిలయన్స్ కమ్యూనికేషన్స్ కోసం చైనా బ్యాంకుల నుంచి అనిల్ అంబానీ భారీగా రుణాలు తీసుకున్నారు. కంపెనీ తరఫున తీసుకున్న ఈ రుణాలకు ఆయన వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించారు. ఇప్పుడా ష్యూరిటీలే అనిల్ మెడకు చుట్టుకున్నాయి. 2012లో తాము రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ సంస్థకు 925 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చామని, ఆ రుణం రికవరీ కోరుతూ ఆ మూడు చైనా ప్రభుత్వ బ్యాంకులు బ్రిటన్ కోర్టును ఆశ్రయించాయి.

దీనిపై విచారణలో భాగంగా, రూ.700 కోట్లు కోర్టులో జమ చేయాలని న్యాయస్థానం అనిల్ ను ఆదేశించింది. అందుకు ఆరు వారాల గడువు విధించింది. ఈ సందర్భంగా అనిల్ అంబానీ చేతులెత్తేశారు. "నా పెట్టుబడుల విలువ పూర్తిగా క్షీణించింది. ఇప్పుడు నా ఆస్తుల విలువ సున్నా. సంక్షిప్తంగా చెప్పాలంటే నగదుగా మార్చుకోగలిగే వీలున్న ఆస్తులేవీ ఇప్పుడు నా అధీనంలో లేవు" అంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు.

గతంలో ఇలాంటి పరిస్థితుల్లోనే అనిల్ ను ఆయన అన్న ముఖేశ్ అంబానీ రూ.462 కోట్లు చెల్లించి ఆదుకున్నారు. మరి ఈసారి అనిల్ పరిస్థితి ఏమవుతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.

Anil Ambani
Reliance
China
Banks
UK
Mukesh Ambani
  • Loading...

More Telugu News