Union Minister: మహిళలు నిర్ణయాలు తీసుకోలేరని అనుకుంటున్నారా?: కేజ్రీవాల్ పై స్మృతి ఇరానీ ధ్వజం
- ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్ నేపథ్యంలో స్మృతి ఇరానీ వ్యాఖ్య
- ఓటేసే ముందు ఇంట్లోని మగవాళ్లతో చర్చించాలని కేజ్రీవాల్ ట్వీట్
- ట్విట్టర్ మాధ్యమంగా స్మృతి ఇరానీ,కేజ్రీవాల్ మధ్య వాగ్వాదం
ఓటు వేసేటప్పుడు ఇంట్లోని మగవాళ్లను మీ వెంట తీసుకువెళ్లండి. ఎవరికి ఓటువేయాలనే విషయంపై వారితో కలిసి చర్చించండని ఢిల్లీ సీఎం ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భగ్గుమన్నారు. మహిళలకు నిర్ణయాలు తీసుకునే శక్తి లేదనుకుంటున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఉదయం ఢిల్లీ ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ మాధ్యమంగా పిలుపునిచ్చారు.
‘ఓటర్లందరూ తప్పకుండా ఓటు వేయండి. మహిళలకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఏమిటంటే.. ఎలాగైతే మీరు మీ కుటుంబ బాధ్యతలను మోస్తారో అదే విధంగా దేశం, ఢిల్లీ బాధ్యతలను మీ భుజాన వేసుకోండి. ఓటును కచ్చితంగా వేయండి. ఓటు వేసేందుకు ఇంట్లోని పురుషులను కూడా వెంట తీసుకెళ్లండి. ఎవరికి ఓటేయాలనే విషయంపై మగవారితో చర్చించండి’ అని తన సందేశంలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.
దీనిపై స్మృతి ఇరానీ స్పందిస్తూ.. మహిళలు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరని మీరు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. దీంతో వీరి మధ్య ట్విట్టర్ మాధ్యమంగా వాదప్రతివాదాలు కొనసాగాయి. చివరికి కేజ్రీవాల్ 'మహిళలు తామేమి చేయాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారు' అని పోస్ట్ చేయడంతో ఈ వివాదం ముగిసింది.