P.Chidambaram: మోదీ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకం: చిదంబరం
- దేశంలో ప్రగతి కనిపించడంలేదు
- పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ రావడంలేదు
- విదేశీ నిల్వలు పడిపోతున్నాయి
కేంద్రంలో మోదీ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం విమర్శించారు. కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ విభాగం ఏర్పాటు చేసిన సదస్సులో చిదంబరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందంటూ.. దేశంలో ఏ రంగంలోనూ ప్రగతి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం అచ్చేదిన్ అంటూ ప్రజలను మోసం చేస్తోందని పేర్కొన్నారు. దేశంలోకి పెట్టుబడులు రావడం లేదన్నారు. విదేశీ నిల్వలు కూడా పడిపోతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎందుకు స్పందించడం లేదని చిదంబరం ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ చారిత్రక తప్పిదాలని వ్యాఖ్యానించారు. ఈ చర్యవల్ల పారిశ్రామిక ప్రగతి చతికిలపడిందని చెప్పారు.