Vellampalli Srinivasa Rao: నాడు చంద్రబాబు నుంచి కార్పొరేటర్ వరకు కమీషన్ కోసమే పని చేశారు: ఏపీ మంత్రి వెల్లంపల్లి ఆరోపణ

- టీడీపీ పాలన ధనార్జనే లక్ష్యంగా సాగింది
- గత ప్రభుత్వం కేంద్ర నిధులను సైతం మళ్లించింది
- విజయవాడలో రోడ్డు పనులకు వెల్లంపల్లి శంకుస్థాపన
విజయవాడ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇవాళ పర్యటించారు. పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్ లో కోటి 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ.450 కోట్ల నిధులను సైతం మళ్లించిందని ఆరోపించారు. గత ఐదు సంవత్సరాల్లో జలీల్ ఖాన్, ఎంపీ కేశినేని నాని ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ధనార్జనే లక్ష్యంగా టీడీపీ పాలన సాగిందని, చంద్రబాబు నుంచి కార్పొరేటర్ వరకు కమీషన్ కోసమే పని చేశారన్నది బహిరంగ రహస్యమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
