Degree College: ‘డిగ్రీ కాలేజ్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ గుంటూరులో ఆందోళన

  • పవిత్రమైన కళాశాలను అశ్లీలానికి నిలయంగా మార్చివేశారు
  • డబ్బు సంపాదన కోసం ఇంతలా దిగజారాలా?
  • ప్రభుత్వం అనుమతి ఎలా ఇచ్చిందన్న విద్యార్థులు

‘డిగ్రీ కాలేజ్’ సినిమాకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అశ్లీల, అసభ్యకర పోస్టర్లతో సినిమాను ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుతో ఇటీవల హైదరాబాద్, ఎస్సార్ నగర్ ‌పోలీస్ స్టేషన్‌లో దర్శక, నిర్మాతలపై కేసు నమోదైంది. దీంతో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

 తాజాగా, ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ గుంటూరులోని బాలీవుడ్, హాలీవుడ్ సినిమా థియేటర్ల వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వరంలో నిన్న పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పవిత్రమైన కళాశాలను అశ్లీలానికి నిలయంగా ఈ సినిమాలో మార్చివేశారని ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు సంపాదన కోసం ఇంతగా దిగజారడం తగదన్నారు.

ఈ సందర్భంగా సెన్సార్ బోర్డుపైనా వారు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడం దారుణమన్నారు. దిశ చట్టం తీసుకొచ్చిన రాష్ట్రం ఇలాంటి సినిమాల విడుదలకు అనుమతి ఎలా  ఇచ్చిందని ప్రశ్నించారు. వెంటనే ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News