Nalgonda District: ఆస్తిలో వాటా అడిగిన కుమార్తె.. చంపేందుకు యత్నించిన తల్లిదండ్రులు!
- ఆస్తిలో వాటా ఇచ్చేందుకు తల్లిదండ్రుల నిరాకరణ
- పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమార్తె
- కుమారుడితో కలిసి కూతురిపై విచక్షణ రహితంగా దాడి
ఆస్తిలో వాటా అడిగిందన్న కారణంతో కన్నపేగునే కడతేర్చాలనుకున్నారు తల్లిదండ్రులు. కుమారుడితో కలిసి కన్న కూతురి ప్రాణాలను తీసేందుకు సైతం వెనకాడలేదు. దారుణంగా కొట్టి ఇంటి పక్కనే ఉన్న ముళ్లపొదల్లో పడేశారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఎల్లగూడెంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిందీ ఘటన.
పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తీర్పారి బుచ్చయ్య, లక్ష్మమ్మ దంపతులకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు సంతానం. కుమారుడు, ఇద్దరు కుమార్తెలకు ఇప్పటికే పెళ్లిళ్లు కాగా, చిన్న కుమార్తె కవిత (32)కు సంబంధాలు చూస్తున్నారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివిన కవిత ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వరుడిని చూడాలని, లేదంటే తన వాటా కింద వచ్చే భూమిని తన పేర రిజిస్ట్రేషన్ చేయాలని తల్లిదండ్రులను కోరుతోంది. భూమిలో వాటా ఇచ్చేందుకు తల్లిదండ్రులు నిరాకరించడంతో గతేడాది ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆస్తి రాసిస్తామని పోలీసుల ఎదుట అంగీకరించారు. అయితే, ఆ తర్వాత మళ్లీ ఆ ఊసే ఎత్తకపోవడంతో రెండు రోజుల క్రితం కవిత మళ్లీ పోలీసులను ఆశ్రయించింది.
తమపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమార్తెపై కక్ష పెంచుకున్న తల్లిదండ్రులు, సోదరుడు గోవర్ధన్ ఆమెపై దాడికి దిగారు. కర్రలు, బండరాళ్లతో విచక్షణ రహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన కవిత మృతి చెందిందని భావించి ఇంటి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో పడేశారు. ఆమెను గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కవితను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి అన్న, తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.