Carona Virus: కరోనా పై పోరులో 'అమ్మా' అంటూ కూతురు.. 'బిడ్డా' అంటూ తల్లి గాల్లోనే హగ్!
- కరోనా వైరస్ తో తల్లి, కూతురు మధ్య ఎడబాటు
- వైరల్ గా మారిన వీరికి సంబంధించిన వీడియో
- కరోనాతో ఇప్పటివరకు 638 మంది మృతి
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. అయితే.. వైరస్ ఉనికి వెలుగులోకి వచ్చిన చైనాలో పరిస్థితి ఘోరంగా ఉంది. కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 638 మంది చనిపోయారు. కాగా, 31 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ కారణంగా చైనాలో ప్రజలు నానా యాతన పడుతున్నారు. ఇక వైరస్ సోకిన రోగులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది పడే అగచాట్లకు అంతేలేకుండా పోతోంది.
హనాన్ ప్రావిన్స్ లోని పుగావ్ కౌంటీలో ఉన్న పీపుల్స్ ఆస్పత్రిలో ఓ నర్స్, ఆమె కూతురు ఒకరి నొకరు దూరం నుంచి సంభాషించిన తీరు హృదయాలను కలచి వేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను చైనా ప్రభుత్వం విడుదల చేయడంతో అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు వద్దకు ఆమె కుమార్తె ఓ సంచి పట్టుకుని వచ్చింది.
అయితే వారిద్దరు మాస్క్ లు ధరించి ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా బయటివారిని కలుసుకోవడంపై నిషేధం ఉండటంతో కూతురు దూరం నుంచి ‘అమ్మా నిన్ను చాలా మిస్ అవుతున్నా’ అంటూ గాల్లోనే చేతులు చాచగా.. నర్సు కూడా అదే రీతిలో స్పందించింది. ఇద్దరూ చేతులు చాచి ఒకరి నొకరు కౌగలించుకున్నట్లు దూరంగా నిలబడిపోయారు. 'ఆస్పత్రిలో కరోనా పిశాచితో పోరాడుతున్నా.. దాన్ని తరిమికొట్టాకే ఇంటికి వస్తా' అంటూ ఆమె కూతురు తెచ్చిన సంచిని తీసుకుని ఆస్పత్రిలోకి వెళ్లి పోయింది. ఇప్పటికే లక్షలమంది ఈ వీడియో ను చూసి కామెంట్లు పెడుతున్నారు.