Vangaveeti Radha: ‘దున్నపోతు మీద వర్షం కురిసినట్టు’ ఉంటే ఏం చేస్తాం?: వైసీపీ ప్రభుత్వంపై వంగవీటి రాధ ఆగ్రహం
- రైతులకు మద్దతుగా విజయవాడలో ర్యాలీ
- రైతుల ఉద్యమంపై సర్కార్ స్పందించకపోవడం దారుణం
- మూర్ఖత్వం పక్కనబెట్టి ప్రజల గురించి ఆలోచించాలి
రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కుమ్మరిపాలెం సెంటర్ నుంచి సితార సెంటర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. రైతులకు తన మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా తనను పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇన్ని రోజుల నుంచి రైతులు ఉద్యమిస్తున్నా ప్రభుత్వం స్పందింకపోవడంపై మండిపడ్డారు. ‘దున్నపోతు మీద వర్షం కురిసినట్టు’ ఉంటే ఏం చేస్తాం? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మూర్ఖత్వాన్ని పక్కనబెట్టి, ప్రజల గురించి ఆలోచించాలని సూచించారు.
కోర్టు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం ధిక్కరించడంపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘మూడు రాజధానులు’ కాదు ఒక్కటే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజధాని అంశం రాష్ట్రానికి సంబంధించిన సమస్య కనుక అన్ని పార్టీలు, అన్ని సంఘాల మద్దతు తీసుకుని జేఏసీతో కలిసికట్టుగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.