BJP: సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఏపీలో చీకటి రోజులు: బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి
- ఇతర రాష్ట్రాలు పెట్టుబడులకోసం ప్రయత్నిస్తున్నాయి
- సీఎం జగన్ ఉన్న వాటిని పంపించేస్తున్నారు
- ఏపీ పరిస్థితి బీహార్ కంటే దారుణంగా మారింది
సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ కు చీకటి రోజులు వచ్చాయని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాలు పెట్టుబడులకోసం ప్రయత్నిస్తూంటే.. జగన్ మాత్రం ఉన్న కంపెనీలను వెళ్లగొడుతున్నాడని ఆరోపించారు. బైరెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. 370 అధికరణ రద్దుకు ముందు జమ్మూ కశ్మీర్ లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ కూడా ముందుకు రాలేదన్నారు. అధికరణ రద్దు తర్వాత.. పరిస్థితి మారిందన్నారు.
మొన్నటివరకు బీహార్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడేవారని, ఇప్పుడు ఏపీ అంతకంటే దారుణంగా తయారైందని బైరెడ్డి చెప్పారు. చంద్రబాబుపై కక్ష తీర్చుకుంటే చాలన్నట్లు వైసీపీ ప్రభుత్వ వైఖరి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కోతి చేష్టల వల్ల వనమంతా చెడిపోయిందన్నారు. జగన్ ఏపీకి సీఎంను అన్న విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ ఒకసారి సమీక్షించాలని కోరనున్నట్లు ఆయన చెప్పారు.