Corona Virus: ఇదొక వెర్రి... కరోనా ఉందంటూ అబద్ధమాడి అరెస్టయ్యాడు!
- సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ప్రయత్నం
- వుహాన్ నుంచి వచ్చానంటూ విమానంలో కలకలం రేపిన యువకుడు
- తనవద్దకు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి
- అధికారులతో అంతా నిజమే చెప్పిన యువకుడు
ఎలాగైనా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని ఈ యువకుడు చేసిన పని అతడ్ని కటకటాల వెనక్కినెట్టింది. తనకు కరోనా వైరస్ ఉందని విమానంలో హంగామా సృష్టించిన ఓ యువకుడ్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జేమ్స్ పొటోక్ ఫిలిప్పే అనే 28 ఏళ్ల యువకుడు కెనడాలోని టొరంటో నుంచి జమైకాకు విమానంలో వెళుతున్నాడు. ప్రయాణంలో ఒక్కసారిగా తన సీట్లోంచి లేచిన ఫిలిప్పే తనకు కరోనా సోకినట్టుగా అనుమానం కలుగుతోందని, ఎవరూ తన వద్దకు రావొద్దంటూ కలకలం రేపాడు. తాను ఇటీవలే చైనాలోని వుహాన్ నుంచి వచ్చానని చెప్పడంతో ప్రయాణికులు హడలిపోయారు.
దాంతో విమాన సిబ్బంది విమానాన్ని కెనడాలోని పియర్సన్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా కిందికి దించారు. అయితే అధికారుల విచారణలో తాను కావాలనే అబద్ధం చెప్పానని, సోషల్ మీడియాలో విపరీతమైన గుర్తింపు తెచ్చుకునేందుకే ఇలా చేశానని చెప్పడంతో అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.