Crime News: సిద్ధిపేట జిల్లాలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. బాధితుడికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

  • ఏకే-47తో రెండు రౌండ్ల కాల్పులు  
  • మిస్ ఫైర్ కావడంతో బతికి పోయిన బాధితుడు 
  • మూడు రోజుల క్రితం ఇటుకల కోసం గొడవ 

నిర్మాణానికి ఉపయోగించే ఇటుకల విషయమై జరిగిన స్వల్ప వివాదం నేపథ్యంలో ఏకంగా ఏకే-47తో కాల్పులకు తెగబడ్డాడో వ్యక్తి. అయితే మిస్ ఫైర్ కావడంతో బాధితుడు తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని అక్కన్న పేటలో నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలానికి కారణమైంది.

పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన గంగరాజు, సదానందం అనే వ్యక్తులు మూడు రోజుల క్రితం ఇటుకల విషయమై తగాదా పడ్డారు. దీన్ని మనసులో పెట్టుకున్న సదానందం నిన్న అర్ధరాత్రి తర్వాత గంగరాజు కుటుంబ సభ్యులతో ఉండగా ఏకే-47తో వచ్చి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో భయాందోళనలకు గురైన గంగరాజు కుటుంబం పరుగులు తీసి తప్పించుకుంది.

అనంతరం సదానందం పారిపోయాడు. సమాచారం అందడంతో హుస్నాబాద్, సిద్ధిపేట ఏసీపీలు సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని రెండు పేలిన తూటాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సదానందం ఇంటిని తనిఖీ చేసి తల్వార్ కత్తి, తుపాకీ బెల్ట్, బాడిషా కత్తి, రెండు ఫోన్లు, రెండు బ్యాంకు ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు పరారీలో ఉండడంతో అతని కోసం గాలిస్తున్నారు. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.

Crime News
Siddipet District
husnabad mandal
firing
  • Loading...

More Telugu News