south central railway: శాఖాపరమైన పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భారీగా రైళ్ల రద్దు
- ముద్కేడ్-పర్బని సెక్షన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు
- 37 రైళ్లు పూర్తిగా... 33 రైళ్లు పాక్షికంగా రద్దు
- ఈ నెల 8, 9, 10వ తేదీల్లో అమలు
శాఖాపరమైన పనులు చేపడుతున్న కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 8, 9, 10వ తేదీల్లో భారీగా రైళ్లను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. ముద్కేడ్-పర్బని సెక్షన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నందున ఈ నెల 8వ తేదీన కొన్ని, 9,10వ తేదీల్లో మరికొన్ని రైళ్లు ఐదు నుంచి ఏడు రోజులపాటు రద్దుకానున్నట్లు తెలిపారు. 37 రైళ్లను పూర్తిగా రద్దు చేస్తుండగా, మరో 33 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు నిన్న విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
మేడ్చల్-హెచ్‌ఎస్, నాందేడ్-మేడ్చల్, ఆదిలాబాద్-పూర్ణ-ఆదిలాబాద్, నిజామాబాద్-పంధర్‌పూర్-నిజామాబాద్, తిరుపతి-అమరావతి-తిరుపతి, ఆదిలాబాద్-పర్లి-ఆదిలాబాద్ మధ్య తిరిగే రైళ్లపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. హైదరాబాద్-ఔరంగాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, ఔరంగాబాద్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.