Under-19 World Cup: అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ప్రవేశించిన బంగ్లాదేశ్... భారత్ తో టైటిల్ పోరుకు రెడీ
- కివీస్ తో సెమీస్ లో 6 వికెట్ల తేడాతో నెగ్గిన బంగ్లాదేశ్
- 212 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన బంగ్లా జట్టు
- ఫిబ్రవరి 9న ఫైనల్ మ్యాచ్
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ లో ఈసారి టైటిల్ పోరాటం ఆసియా జట్ల మధ్య జరగనుంది. ఇప్పటికే భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లగా, ఇవాళ జరిగిన రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్ జట్టు 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను మట్టికరిపించి భారత్ తో టైటిల్ పోరుకు సిద్ధమైంది.
పోచెఫ్ స్ట్రూమ్ లో జరిగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు 212 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 44.1 ఓవర్లలో ఛేదించింది. మహ్మదుల్ హసన్ జాయ్ (100) సెంచరీ సాధించి జట్టు విజయానికి బాటలు పరిచాడు. మిడిలార్డర్ లో తౌహిద్ హృదయ్ (40), షహాదత్ హుస్సేన్ (40 నాటౌట్) రాణించడంతో బంగ్లా గెలుపు తీరాలకు చేరింది.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కుర్రాళ్లు 50 ఓవర్లలో 8 వికెట్లకు 211 పరుగులు మాత్రమే చేశారు. ఇక, భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 9 ఆదివారం ఇదే మైదానంలో జరగనుంది.