Pawan Kalyan: ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతుంటే ఉపాధి అవకాశాలు ఎలా మెరుగుపరుస్తారు?: పవన్ కల్యాణ్
- ‘కియా’ యూనిట్లు పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయి
- ఈ వార్తలు విస్మయానికి గురిచేస్తున్నాయి
- ఈ విషయాన్ని చెప్పింది ఆషామాషీ వార్తా సంస్థ కాదు
ఏపీలోని అనంతపురం జిల్లాలో ఉన్న కియా పరిశ్రమలోని యూనిట్లు పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయంటూ వస్తున్న వార్తలు విస్మయానికి గురిచేస్తున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ వార్తను ప్రపంచానికి తెలియజేసింది ఏదో ఆషామాషీ సంస్థ కాదని, ‘రాయిటర్స్’ అనే ప్రఖ్యాత వార్తా సంస్థ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలకు ఈ సంఘటన అద్దంపడుతోందని అన్నారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు సానుకూల పరిస్థితులను నెలకొల్పాల్సిన ప్రభుత్వం, ఆ బాధ్యతను విస్మరిస్తోందని విమర్శించారు. కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు, సాఫ్ట్ వేర్ సంస్థలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగవుతాయని ప్రశ్నించారు.
విశాఖలోని మిలీనియం టవర్స్ నుంచి సాఫ్ట్ వేర్ సంస్థలను ఖాళీ చేయించడమంటే ఆ రంగం ఇకపై ఆంధ్రప్రదేశ్ వైపు చూడకుండా చేయడమే అవుతుందని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఉపాధి కల్పనకు ఆస్కారం ఉన్న రంగాలను ప్రోత్సహించకపోగా నిరుత్సాహకర పరిస్థితులు సృష్టిస్తే ఆర్థికాభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
ఏపీలో ఉపాధి అవకాశాలు పెంచి వలసలు అరికట్టాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతలను వదిలేసి రద్దులు, కూల్చివేతలు, తరలింపులు అంటోందని ధ్వజమెత్తారు. నిర్మాణాత్మక ఆలోచనలు, ప్రణాళికలు లేని పాలక పక్షాన్ని చూసే రాష్ట్రం నుంచి పారిశ్రామిక సంస్థలు తరలిపోతున్నాయన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని సూచించారు.