Undavalli Arun Kumar: కేంద్రానికి మెయిల్ పంపాను.. పట్టించుకుంటారో లేదో!: ఉండవల్లి అరుణ్ కుమార్
- కేవలం హిందుత్వ ఎజెండాతో పాలన కొనసాగిస్తోంది
- ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దట్లేదు
- మనకన్నా బంగ్లాదేశ్ జీడీపీ ఎక్కువగా ఉంది
కేంద్ర ప్రభుత్వ విధానాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. మన దేశ జీడీపీ కన్నా బంగ్లాదేశ్ జీడీపీ అధికంగా ఉందని అన్నారు. మనం సాయం చేసిన బంగ్లాదేశ్ ఇప్పుడు మనకన్నా ఎక్కువ జీడీపీని సాధించిందన్నారు. మన్మోహన్ ప్రధాని అయిన తర్వాత మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడిందని, ఆ తర్వాత మళ్లీ నాశనమైందని చెప్పారు.
కేవలం హిందుత్వ, పాకిస్థాన్ ఎజెండాతో కేంద్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దట్లేదని ఉండవల్లి ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని కేంద్ర ప్రభుత్వానికి మెయిల్ పంపానని, తన మెయిల్‌ను వారు పట్టించుకుంటారో లేదోనని అన్నారు. తాము ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లమేనని బీజేపీ నేతలు చెప్పుకుంటారని అన్నారు. తాను కూడా ఆర్‌ఎస్‌ఎస్‌కు వెళ్లిన వాడినేనని, కొన్ని రోజులు వెళ్లి మానేశానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్థిక వ్యవస్థపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు.