KIA Motors: మా ప్లాంట్ ను తరలించడం లేదు: కియా మోటార్స్ స్పష్టీకరణ
![](https://imgd.ap7am.com/thumbnail/tn-10fdc8d616ae.jpg)
- 'రాయిటర్స్' కథనంపై మండిపడిన మార్కెటింగ్ హెడ్
- ఇదో చెత్త ఊహాగానమని ఆగ్రహం
- ఏపీ ప్రభుత్వం కూడా ఖండన
ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్‌ను తరలించాలన్న యోచన తమకు లేదని కియా మోటార్స్ ప్రకటించింది. ఏపీలో ఉన్న 110 కోట్ల డాలర్ల విలువైన ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించే యోచనలో కియా మోటార్స్ ఉందని అంతర్జాతీయ మీడియా సంస్థ ‘రాయిటర్స్’ రాసిన కథనాన్ని సంస్థ ఖండించింది.
‘ఈ కథనం చూసి ఆశ్చర్యపోయాం. ఇది అత్యంత చెత్త ఊహాగానం. ఏపీలో మా ప్లాంట్ అద్భుతంగా పనిచేస్తున్న సమయంలో ఇలాంటి ఊహాగానాలు రావడం ఆశ్చర్యం కలిగించింది’ అని కియా మోటార్స్ ఇండియా హెడ్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) మనోహర్ భట్ ఓ ఆంగ్ల మీడియాతో అన్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ఈ కథనాన్ని ఖండించింది. ఈ కథనం పూర్తిగా అవాస్తవమని పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్ తెలిపారు.