Vadde shobanadriswara Rao: విశాఖ రాజధానితో ఉత్తరాంధ్ర అభివృద్ధి అవుతుందన్న మాట అబద్ధం: మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
- పరిపాలనా వికేంద్రీకరణ పేరిట బిల్లు పెట్టారు
- విశాఖలోనే అన్ని ఏర్పాట్లు చేయాలన్నట్టు అందులో ఉంది
- అది వికేంద్రీకరణ ఎలా అవుతుంది?
విశాఖను రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందన్న మాట కన్నా అబద్ధం ఇంకోటి లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. మూడు రాజధానుల అంశంపై ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, శాసనసభలో పెట్టిన బిల్లు ఏమో పరిపాలనా వికేంద్రీకరణ చేస్తున్నామని చెప్పారు.
కానీ, వాస్తవానికి బిల్లులో ఉన్న అంశమేమో విశాఖపట్టణంలో పరిపాలనా రాజధాని, సెక్రటేరియట్, హెచ్ఓడీ ఆఫీసులు.. మొత్తం అన్నీ అక్కడే ఏర్పాటు చేయాలని ఉందని, అది వికేంద్రీకరణ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైజాగ్ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని, దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబయి ఎలానో ఏపీకి విశాఖ అలాంటిదని అభిప్రాయపడ్డారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం వల్ల అదనంగా ఒరిగేదేమీ లేదని అన్నారు.