Jagan: రాజ్యసభలో జగన్ కేసులను ప్రస్తావించిన కనకమేడల.. ఛైర్మన్ అభ్యంతరం!
- జగన్ పై 11 అవినీతి కేసులు ఉన్నాయన్న కనకమేడల
- సభలో పేర్లు ప్రస్తావించొద్దన్న వెంకయ్యనాయుడు
- విజయసాయి తీరుపై కూడా అసహనం వ్యక్తం చేసిన వెంకయ్య
ప్రజాప్రతినిధులపై పెండింగ్ లో ఉన్న కేసులపై ఈ రోజు రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై 11 అవినీతి కేసులు ఉన్నాయని, కోర్టు విచారణకు హాజరు కాలేనని కూడా ఆయన పిటిషన్ వేశారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల అన్నారు. జగన్ పై ఉన్న సీబీఐ కేసుల విచారణను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రం పేరు కాని, ముఖ్యమంత్రి పేరు కాని సభలో ప్రస్తావించవద్దని చెప్పారు. కేవలం ఈ అంశం వరకే చర్చ జరగాలని సూచించారు.
ఇదే సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కనకమేడల ప్రసంగానికి అడ్డుపడ్డారు. సభలో జగన్ పేరును ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు. దీంతో, విజయసాయి తీరుపై వెంకయ్యనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఛైర్మన్ స్థానంలో తాను ఉన్నానని, కనకమేడల వ్యాఖ్యలపై స్పందించడానికి మీరు మంత్రి కాదని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం కనకమేడల తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సీఎంలు, ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.