Chandrababu: ఈ ఏసు వంటి వ్యక్తుల్ని చూసైనా సీఎం జగన్ సరైన నిర్ణయం తీసుకోవాలి: చంద్రబాబు
- రాజధాని రైతుల దీక్షా శిబిరంలో చంద్రబాబు
- అమరావతి జేఏసీకి రూ.50 వేలు విరాళం ఇచ్చిన ఏసు అనే వ్యక్తి
- ఏసుపై చంద్రబాబు ప్రశంసలు
- ఏసు ప్రభువుపై జగన్ కు నమ్మకం ఉంటే అమరావతిని కొనసాగించాలని హితవు
అమరావతి రైతుల దీక్ష శిబిరంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడారు. నాడు తాము ఒక్క పిలుపు ఇవ్వగానే రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని కొనియాడారు. కానీ అమరావతిని ఇప్పుడు శ్మశానం అని, ఎడారి అని అంటున్నారని, నిర్మాణానికి డబ్బుల్లేవంటున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. అమరావతి ముంపు ప్రాంతం అని దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ గ్రీన్ ట్రైబ్యునల్ అమరావతి ముంపు ప్రాంతం కాదని స్పష్టం చేసిందని వెల్లడించారు.
జగన్ కు ఏసు ప్రభువుపై నమ్మకం ఉంటే రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అన్నారు. కాగా, ఏసు అనే వ్యక్తి గత ప్రభుత్వం తనకు ఇచ్చిన రూ.50 వేల పరిహారాన్ని చంద్రబాబు సమక్షంలో అమరావతి జేఏసీకి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు... ఏసును ప్రశంసించారు. ఏసు ప్రభువు ప్రబోధాన్ని అనుసరించి ఈ ఏసు అనే వ్యక్తి విరాళం ఇస్తున్నాడని, జగన్ కూడా సరైన నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు.