Hyderabad: ఎప్పుడో చనిపోయిన వ్యక్తి పేరుమీద లావాదేవీలు.. రిజిస్ట్రేషన్ శాఖ మాయాజాలం!
- హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ శాఖ లీల
- చనిపోయిన వ్యక్తి పేరున నకిలీ ఆధార్ సృష్టి
- దాంతోనే పనిపూర్తి చేసిన రిజిస్ట్రార్
ఆస్తి వ్యవహారాల్లో అమ్మకం, కొనుగోలు జరిగేటప్పుడు ఇరుపక్షాల బాధ్యులు ప్రత్యక్షంగా ఉండి, వారి వేలిముద్రలు, ఫేస్ ఐడెంటిఫికేషన్ తదితర జాగ్రత్తలు తీసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. కానీ పద్నాలుగేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చి తొమ్మిది నెలల క్రితం తన భూమిని అమ్ముకున్నాడు. ఇదెలా సాధ్యం? అనుకుంటున్నారా. అదే మరి రిజిస్ట్రేషన్ శాఖ మాయాజాలం. ఏం నమ్మకం కుదరడం లేదా? అయితే ఈ కథనం చదవండి.
హైదరాబాద్ ధూల్ పేటకు చెందిన ఎ.జగన్ సింగ్ కు రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్ లో సర్వేనంబరు 96/2, 96/3 ప్లాట్ నంబరు బి-147లో 300 గజాల స్థలం ఉంది. జగన్ సింగ్ ఈ స్థలాన్ని 1989లో కొనుగోలు చేయగా, అతను 2005, అక్టోబరు 12న చనిపోయాడు. అప్పటికి ఆధార్ వ్యవస్థ రాలేదు.
ఇక్కడ గజం స్థలం ధర రూ.45 వేల నుంచి రూ.50 వేలు పలుకుతోంది. ఈ స్థలంపై కన్నేసిన అక్రమార్కులు మరో వ్యక్తిని జగన్ సింగ్ గా చూపిస్తూ నకిలీ ఆధార్ సృష్టించారు. అతని నుంచి తాము భూమి కొన్నట్లు గత ఏడాది జూన్ 29న గండిపేట రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
జగన్ సింగ్ కొడుకు దీనిపై గత ఏడాది డిసెంబర్ లో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రయవిక్రయాల సమయంలో రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆధార్ కార్డులు ఆన్‌లైన్లో పరిశీలిస్తారు. కార్డులో ఎదురుగా ఉన్న వ్యక్తే ఉండడంతో అతనే జగన్ అనుకున్నామన్నది రిజిస్ట్రేషన్ శాఖ వాదన.
కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీడియో తీయాలి, ఫీజు రూ.5 లక్షలు దాటితే పాన్ కార్డు వాడాలి. ఇక్కడ అవేవీ జరగలేదు. రూ.15 లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకున్న అధికారులు పాన్ కార్డును అడగకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బాధితుడు ఫిర్యాదు చేసినట్టు వెలుగు చూడడంతో నకిలీ రిజిస్ట్రేషన్ జరిగినట్టు రిజిస్ట్రార్ కూడా ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం కొసమెరుపు.