Hyderabad: హైదరాబాద్‌వాసులకు మరో శుభవార్త.. అందుబాటులోకి ఎంజీబీఎస్-జేబీఎస్ మెట్రో మార్గం!
- ఎల్లుండి ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- 11 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో 9 స్టేషన్లు
- ఢిల్లీ తర్వాత అతి పెద్ద మెట్రో మార్గం కలిగిన నగరంగా హైదరాబాద్
హైదరాబాద్ నగరవాసులకు ఇది శుభవార్తే. ఈ నెల 7వ తేదీ నుంచి మరో మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. మెట్రోరైలు మొదటి దశలో చివరిదైన ఈ మార్గాన్ని ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభిస్తారు. అనంతరం అదే రైలులో మంత్రులు, అధికారులతో కలిసి సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ వరకు ప్రయాణిస్తారు. మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
11 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో మొత్తం తొమ్మిది స్టేషన్లు ఉన్నాయి. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్‌కు మెట్రో రైలులో కేవలం 18 నిమిషాల్లో చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. అదే బస్సులో వెళ్లాలంటే మాత్రం దాదాపు గంట సమయం పడుతుందని పేర్కొన్నారు. జేబీఎస్-ఎంజీబీఎస్ ప్రారంభమైతే నగరంలో మొత్తం 69 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా ఢిల్లీ తర్వాత అతిపెద్ద మెట్రో మార్గం కలిగిన నగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు లభిస్తుంది.