Bobbili: బొబ్బిలిలో వింత కుటుంబం.... విజయనగరం జిల్లా తమకు అప్పగించాలని సీఎం జగన్ కు విజ్ఞప్తి!
- కొన్నేళ్లుగా ఇంటికే పరిమితమైన కుటుంబం
- పిల్లల చదువులకు సైతం స్వస్తి
- ఇరుగుపొరుగు వాళ్ల సమాచారంతో స్పందించిన మీడియా
- మీడియా ప్రతినిధులు దిగ్భ్రాంతికి గురయ్యేలా మాట్లాడిన ఇంటిపెద్ద
మారుతున్న జీవనశైలి, సామాజిక ధోరణులు కొందరిలో మానసిక ఉత్పరివర్తనాలకు కారణమవుతున్న దాఖలాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఓ కుటుంబాన్ని చూస్తే ఇదే సందేహం వస్తుంది. ఓ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి రెండేళ్లుగా ఇంటికే పరిమితం అయ్యారు. వాళ్లకు ఎంతోమంది బంధువులున్నా అందరినీ వదిలేసి ఇంట్లోనే కాలం గడుపుతున్నారు. ఆఖరికి పిల్లలను కూడా చదువు మాన్పించేశారు. ఏదైనా పనుంటే ఇంటి యజమాని ఎవరూ జనాల్లేని సమయం చూసి బయటికి వస్తాడు. పని చూసుకుని ఇంట్లోకి వెళ్లిపోవడం... అదీ వారి దినచర్య!
ఇరుగుపొరుగు వారి సమాచారంతో మీడియా సదరు కుటుంబాన్ని సంప్రదించగా, మతిపోయేలా మాట్లాడారు. ఇంటి యజమాని అనుకుంటే ఆయన భార్య కూడా తాను సైతం తక్కువ తినలేదన్నట్టు మీడియా ప్రతినిధులకు దిగ్భ్రమ కలిగించింది. తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని, రాష్ట్రంలోని 12 జిల్లాలు సీఎం జగన్ ఉంచేసుకుని, ఒక్క విజయనగరం జిల్లాను మాత్రం తనకిచ్చేయాలని ఆ ఇంటిపెద్ద విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు, తన జిల్లాలో మాత్రం తెలుగు మీడియంనే అమలు చేయాలని తెలిపాడు.
ఇక, ఎప్పుడైనా సీఎం జగన్, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ తమ జిల్లాకు వస్తే వారి బందోబస్తు ఏర్పాట్లు, కటౌట్లు, ఇతర ప్రచార కార్యక్రమాలన్నీ తానే చూసుకుంటానని చెప్పాడు. మధ్యమధ్యలో ఆయనకు భార్య కూడా వంతపాడుతుండడం చూసి మీడియా ప్రతినిధులు వారి మానసిక పరిస్థితిపై ఓ అవగాహనకు వచ్చారు. ఈ విచిత్ర కుటుంబం గురించి ఏఎస్పీ గౌతమీ శాలికి వివరించగా, ఆ ఉన్నతాధికారి ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని స్పందించారు.