IPL: ఐపీఎల్ లో ఇప్పటికీ వన్నె తగ్గని చెన్నై సూపర్ కింగ్స్... అదిరిపోయే రేంజిలో బ్రాండ్ విలువ

  • 75 మిలియన్ డాలర్లకు చేరిన చెన్నై ఫ్రాంచైజీ వాల్యూ
  • ఐపీఎల్ ప్రారంభంలో చెన్నై బ్రాండ్ వాల్యూ 39 మిలియన్ డాలర్లు
  • ధోనీ నాయకత్వంలో అద్భుత ప్రస్థానం సాగిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ లో మూడు సార్లు టైటిల్ నెగ్గిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో అద్బుతమైన విజయాలు సాధిస్తూ దేశవ్యాప్తంగా అభిమానులను అలరిస్తోంది. ఇప్పుడా ఫ్రాంచైజీ మరో ఘనత అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో 75 మిలియన్ డాలర్ల విలువ కలిగిన ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకుంది.

2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా, ఆ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ విలువ కేవలం 39 మిలియన్ డాలర్లు. ఇప్పుడది 75 మిలియన్ డాలర్లకు చేరింది. బ్రాండ్ వాల్యూ విషయంలో చెన్నై తర్వాత 66.5 మిలియన్ డాలర్లతో కోల్ కతా నైట్ రైడర్స్ రెండోస్థానంలో ఉంది. ఇక, నాలుగు సార్లు ఐపీఎల్ విజేత ముంబయి ఇండియన్స్ ఈ విషయంలో మూడో స్థానంలో ఉంది. ముంబయి ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూ 65.7 మిలియన్ డాలర్లు. ఐపీఎల్ లో పరాజయాల విషయంలో బెంగళూరు జట్టుతో పోటీపడే ఢిల్లీ క్యాపిటల్స్ ఆశ్చర్యకరంగా నాలుగో స్థానంలో నిలిచింది. ఆ జట్టు 25 శాతం పెరుగుదలతో 54 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూ నమోదు చేసింది.

వరల్డ్ ఫేమస్ లీగుల పరంగా చూస్తే ఐపీఎల్ కూడా రాకెట్ వేగంతో దూసుకెళుతోందనే చెప్పాలి. ఇప్పుడు ఐపీఎల్ లీగ్ బ్రాండ్ విలువ 5.7 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన లీగ్ గా పేరుగాంచిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) విలువ 6.4 బిలియన్ డాలర్లు కాగా, దాని పోటీదారు 'లా లీగా' 4.2 బిలియన్ డాలర్లు నమోదు చేసింది. ఈ రెండు లీగ్ ల స్థాయికి ఐపీఎల్ కూడా చేరడం, అది కూడా స్వల్ప సమయంలోనే ఎదగడం మామూలు విషయం కాదు.

  • Loading...

More Telugu News