Lok Sabha: భోజనంపై లోక్ సభలో ఆసక్తికర చర్చ.. ములాయం సింగ్ అభిప్రాయాన్ని కోరిన స్పీకర్!
- జీరో అవర్ తర్వాత భోజనం కోసం సభను వాయిదా వేసిన స్పీకర్
- సభను కొనసాగించాలని పట్టుబట్టిన కొందరు సభ్యులు
- భోజనం చాలా అవసరం అని చెప్పిన ములాయం
భోజన సమయానికి సంబంధించి లోక్ సభలో ఈరోజు ఆసక్తికర చర్చ జరిగింది. జీరో అవర్ తర్వాత మధ్నాహ్నం 1.15 గంటల సమయంలో స్పీకర్ ఓం బిర్లా భోజన విరామం కోసం సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని కొందరు సభ్యులు తిరస్కరించారు. సభను వాయిదా వేయడాన్ని తప్పుబట్టిన కొందరు సభ్యులు... భోజనాన్ని వాయిదా వేయాలని కోరారు. బిజినెస్ ప్రకారం సభను కొనసాగించాలని... భోజనానికి వెళ్లాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని కాంగ్రెస్ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం చోటు చేసుకుంది.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, భోజన విరామ సమయంపై ఓటింగ్ జరపాలని స్పీకర్ ను కోరారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా కల్పించుకుని... భోజనానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే బాధ్యతను సీనియర్ నేత ములాయం సింగ్ కు అప్పగిస్తున్నానని చెప్పారు. 'ములాయం జీ.. భోజనం ఉండాలా? వద్దా? అసలు భోజనం అవసరమా? ఈ విషయాన్ని ఈరోజే మీరు తేల్చి చెప్పండి' అని స్పీకర్ కోరారు.
స్పీకర్ కోరిన వెంటనే విపక్ష సభ్యుల వరుసలో ముందు బెంచ్ లో కూర్చున్న ములాయం నవ్వుతూ లేచి నిల్చున్నారు. ఆయనేమి చెపుతారో అని సభలోని సభ్యులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. సభలోని సభ్యులందరినీ ఒకసారి నవ్వుతూ చూసిన ములాయం... 'భోజనం చాలా అవసరం' అని చెప్పి, సభ్యులందరినీ నవ్వుల్లో ముంచేశారు. ములాయం నిర్ణయాన్ని సభ్యులంతా స్వాగతించారు. వెంటనే భోజనం కోసం సభను వాయిదా వేస్తున్నట్టు ఓం బిర్లా ప్రకటించారు.