Corona Virus: కరోనా ధాటికి ఛిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు... కళ్లు చెమర్చే ఈ ఘటనే నిదర్శనం!

  • చైనాలో విషాద ఘటన
  • కరోనా బారినపడిన తండ్రి, సోదరుడు ఆసుపత్రిలో చేరిక
  • ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయిన బాలుడు
  • సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న బాలుడు
  • తిండిలేక ఆకలితో అలమటించి కన్నుమూత

చైనాలో కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్ అనేక కుటుంబాలను కకావికలం చేస్తోంది. తాజాగా, కరోనా వైరస్ బారినపడి తండ్రి, సోదరుడు ఆసుపత్రి పాలవడంతో ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయిన ఓ బాలుడు ఆకలితో అలమటించి ప్రాణాలు విడిచిన ఘటన చైనాలో చోటుచేసుకుంది.

చైనాలోని హుబేయ్ ప్రావిన్స్ కు చెందిన యాన్ జియావెన్ తన ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తున్నాడు. పెద్ద కుమారుడు యాన్ (17)కు జన్మతః సెరిబ్రల్ పాల్సీ వ్యాధి వచ్చింది. అతడు వీల్ చెయిర్ కు పరిమితం అయ్యాడు. చిన్నకుమారుడు చెంగ్ (11) ఆటిజంతో బాధపడుతున్నాడు. పిల్లల వైకల్యంతో మనోవేదన చెంది తల్లి ఆత్మహత్య చేసుకుంది. దాంతో జియావెన్ పిల్లలకు అన్నీతానై పెంచుతున్నాడు.

అయితే, ఇటీవల జియావెన్ తన చిన్న కుమారుడితో కలిసి వుహాన్ వెళ్లివచ్చాడు. అప్పటినుంచి అస్వస్థతకు గురవడంతో వైద్యపరీక్షలు చేయించగా కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. దాంతో ఆ ఇద్దరినీ ప్రత్యేక ఆసుపత్రికి తరలించడంతో పెద్ద కుమారుడు యాన్ ఇంట్లో ఒక్కడే ఉండిపోయాడు. వీల్ చెయిర్ లో ఉంటూ ఎటూ కదల్లేని నిస్సహాయత కారణంగా ఆకలి తీర్చుకోలేక అల్లాడిపోయాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు.

అంతకుముందు ఆసుపత్రి నుంచే జియావెన్ తన కొడుకు దీనావస్థ గురించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. బంధుమిత్రుల్లో ఎవరైనా అతడికి సాయం చేయాలని విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. తండ్రి, సోదరుడు ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి తిండిలేక మాడిపోయిన ఆ బాలుడు దయనీయ పరిస్థితుల్లో జనవరి 29న కన్నుమూశాడు. ఈ ఘటన మీడియా ద్వారా వెలుగు చూడడంతో ఇరువురు అధికారులపై ఉన్నతాధికారులు వేటు వేశారు.

Corona Virus
China
Boy
Father
Hunger
Dead
  • Loading...

More Telugu News