East Godavari District: ఎట్టకేలకు ఉప్పూడిలో గ్యాస్ లీకేజీ ఆగింది!
- ఫలించిన ఓఎన్జీసీ సిబ్బంది చర్యలు
- రసాయనాలతో కూడిన బురద పంపకుండానే పనిపూర్తి
- మూడు రోజుల నుంచి స్థానికుల్లో ఆందోళనకు తెర
తూర్పుగోదావరి జిల్లా ఉప్పూడి గ్రామ పరిధిలో పైపులైన్ దెబ్బతిని మూడు రోజులుగా జరుగుతున్న గ్యాస్ లీకేజీని ఓఎన్జీసీ నిపుణులు విజయవంతంగా అదుపుచేశారు. లీకేజీ ప్రాంతంలో వాల్వ్ మూసివేయడంతో పని పూర్తయింది. దీంతో లీకేజీ భయంతో మూడు రోజుల నుంచి కంటిమీద కునుకు లేకుండా బతుకుజీవుడా అని ఎదురు చూస్తున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాట్రేనికోన మండలం ఉప్పూడికి సమీపంలోని గంటివారి పేట వద్ద మూడు రోజుల క్రితం ఓఎన్జీసీ పైపులైన్ బద్దలై గ్యాస్ లీకవుతున్న విషయం తెలిసిందే.
దీంతో చుట్టుపక్కల ఉన్న అధికారులు రెండు రోజులుగా చేసిన ప్రయత్నాలేవీ ఫలితం ఇవ్వలేదు. పరిస్థితి ఆందోళనగా మారడంతో అధికారులు ఘటనా స్థలికి చుట్టుపక్కల కిలోమీటరు పరిధిలో ఉన్న నివాసితులను ఖాళీ చేయించారు. కొందరు బంధువుల ఇళ్లకు వెళ్లిపోగా, మరికొందరిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
అధికారుల సూచన మేరకు ముంబయి నుంచి రంగంలోకి దిగిన ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం ఈరోజు ఉదయం ప్లాన్-2ను అమలు చేయడం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రసాయనాలతో కూడిన బురదను లీకవుతున్న గొట్టంలోకి పంపించడం ద్వారా లీకేజీని అదుపు చేయాలని భావించారు.
అయితే ఆ అవసరం లేకుండానే ముందస్తు చర్యలతో గ్యాస్ అదుపులోకి రావడంతో సమర్థవంతంగా వాల్వ్ మూసేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఎలాంటి ప్రమాదం లేదని ఓఎన్జీసీ గ్రూప్ జనరల్ మేనేజర్ ఆదేశ్ కుమార్ తెలిపారు.