Galla Jayadev: లోక్ సభ స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చిన గల్లా జయదేవ్
![](https://imgd.ap7am.com/thumbnail/tn-5d418faf6780.jpg)
- ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోంది
- గళమెత్తిన ప్రజలను పోలీసుల సాయంతో ప్రభుత్వం అణచివేస్తోంది
- శాంతిభద్రతలను గాడిలో పెట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోండి
తనపై వైసీపీ ప్రభుత్వం భౌతిక దాడికి పాల్పడిందంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు. అమరావతి రైతులకు మద్దతుగా అసెంబ్లీ ముట్టడికి జయదేవ్ యత్నించినప్పుడు పోలీసులు ఆయనపై దురుసుగా ప్రవర్తించారంటూ వార్తలొచ్చాయి.
ఈ ఘటనలో ఆయన చొక్కా చినిగిపోయింది. ఒంటిపై స్వల్ప గాయలు కూడా అయ్యాయి. ఈ అంశంపై జయదేవ్ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు. నోటీసుతో పాటు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన కథనాల క్లిప్పుంగులను కూడా అందజేశారు. ఒక ఎంపీ అని కూడా చూడకుండా... తనపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు.
పోలీస్ స్టేషన్ లో తనను నిర్బంధించారని, రాత్రంతా పోలీసు వాహనాల్లో తిప్పారని స్పీకర్ కు గల్లా జయదేవ్ ఫిర్యాదు చేశారు. ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందని... ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన వారిని పోలీసుల సాయంతో ప్రభుత్వం అణచివేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను గాడిలో పెట్టేందుకు వెంటనే చర్యలను తీసుకోవాలని కోరారు.