Rajiv Gandhi: ఈసీ నిషేధం తర్వాత కూడా మారని తీరు.. రాజీవ్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ
- సీఏఏ నిరసనకారులంతా దేశ వ్యతిరేకులే
- సీఏఏ చట్టాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు
- ఇప్పుడున్నది రాజీవ్ ఫిరోజ్ ఖాన్ ప్రభుత్వం కాదు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మపై ఎన్నికల సంఘం 96 గంటల నిషేధాన్ని విధించింది. ఈ నిషేధం గడువు పూర్తయిన తర్వాత కూడా ఆయన తన తీరును మార్చుకోలేదు. మరోసారి తనదైన శైలిలో నోటికి పని కల్పించారు.
ఢిల్లీలోని షహీన్ బాగ్ లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారంతా దేశ వ్యతిరేకులేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్నది 'రాజీవ్ ఫిరోజ్ ఖాన్' కాదని తీవ్ర వ్యాఖ్యలు చేవారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ తండ్రి ఫిరోజ్ ఖాన్ ఒక ముస్లిం అని చెప్పడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి రాజీవ్ తండ్రి ఫిరోజ్ గాంధీ పార్శీ మతానికి చెందిన వ్యక్తి.
సీఏఏ నిరసనకారులంతా దేశ వ్యతిరేకులేనని... ఎందుకంటే వారు మన దేశం నుంచి జమ్ముకశ్మీర్, అసోంలను విడదీయాలని డిమాండ్ చేస్తున్నారని పర్వేశ్ వర్మ మండిపడ్డారు. వారంతా జిన్నా ఆజాదీని కోరుకుంటున్నారని అన్నారు. వారి మాట వినేందుకు ఇది రాజీవ్ ఫిరోజ్ ఖాన్ ప్రభుత్వం కాదని... ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒక అవినీతి పార్టీ అని, వారికి ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యమని అన్నారు.