youtube: తప్పుడు వార్తల వీడియోల విషయంలో.. కీలక నిర్ణయం తీసుకున్న యూ ట్యూబ్!
- పెరిగిపోయిన తప్పుడు ప్రచారాలు
- నిరాధార వీడియోల తొలగింపునకు ప్రత్యేక టీమ్ లు
- వార్తలకు నమ్మదగిన స్థానంగా యూ ట్యూబ్ ను మారుస్తాం
- సంస్థ వైస్ ప్రెసిడెంట్ లెస్లీ మిల్లర్
ఇటీవలి కాలంలో అసత్యపు వార్తలు, తప్పుడు ప్రచారాలు పెరిగిపోయిన నేపథ్యంలో సోషల్ మీడియా వీడియో దిగ్గజం యూ ట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. నిరాధార వార్తలను అరికట్టేందుకు, ఏ విధమైన ఎన్నికలు జరిగినా, వాటికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయడాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెందారని లేదా, ఎన్నికల తేదీల వ్యవహారంలో తప్పుడు సమాచారం గానీ పోస్ట్ చేస్తే, దాన్ని వెంటనే తొలగిస్తామని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. సంస్థ తరఫున నియమించబడిన ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్ లు అన్ని వీడియోలనూ అనుక్షణమూ నిశితంగా పరిశీలిస్తుంటాయని స్పష్టం చేసింది. వార్తలకు నమ్మదగిన స్థానంగా యూ ట్యూబ్ ను మార్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
వార్తలకు సంబంధించిన వివరాలను విశ్వసనీయంగా మార్చేందుకు గత కొన్ని సంవత్సరాలుగా కసరత్తు చేశామని, ఇదే సమయంలో ఆరోగ్యకరమైన రాజకీయ చర్చలకు బహిరంగ వేదికగా యూ ట్యూబ్ ను మలచాలని నిర్ణయించామని సంస్థలో ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ విభాగాలను పర్యవేక్షించే వైస్ ప్రెసిడెంట్ లెస్లీ మిల్లర్ తెలియజేశారు. ఆన్ లైన్ మాధ్యమంలో వివక్షను తొలగించేందుకు కూడా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో వీక్షకులను తప్పుదారి పట్టించే వీడియోలను తొలగించనున్నట్టు తెలిపారు.