Crime News: క్షణికావేశానికి నిండుప్రాణం బలి...అన్నదమ్ముల మధ్య గొడవలో ఒకరి మృతి

  • ఆస్తి విషయమై ఇద్దరి మధ్యా తగాదా
  • కుటుంబ సభ్యుల సమక్షంలో కత్తులతో పరస్పరం దాడి
  • తీవ్రగాయాలతో ఒకరు చనిపోగా మరొకరి పరిస్థితి విషమం

వారసత్వంగా వచ్చే ఆస్తి పంపకం విషయంలో సోదరులు ఇద్దరూ క్షణికావేశానికి లోనుకావడం, కత్తులతో పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. నిన్నరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

కడప జిల్లా రాయచోటి ట్రంక్‌ రోడ్డులో నివాసం ఉంటున్న ఖాయంకాని రోప్‌ఖాన్‌కు ఐదుగురు కొడుకులు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులంతా ఉండగా ఆస్తి విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా రోప్‌ఖాన్‌ మూడో కొడుకు ఆరీపుల్లాఖాన్‌, ఐదో కొడుకు సిగ్బతుల్లాఖాన్‌ మధ్య గొడవ తలెత్తింది. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారడంతో ఇద్దరూ కత్తులు, రాడ్డులతో పరస్పరం దాడి చేసుకున్నారు.

దీంతో ఇద్దరికీ తల, శరీరంపై తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితులు ఇద్దరినీ రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా సిగ్బతుల్లాఖాన్‌ చనిపోయాడు. ఆరీపుల్లాఖాన్‌కు చికిత్స అందిస్తున్నారు.

Crime News
cudupha
brothers fight
one dead
  • Loading...

More Telugu News