Chandrababu: మూడు రాజధానులను ఒప్పుకుంటే భావి తరాలకు అన్యాయం!: చంద్రబాబు
- ఇప్పుడు మాట్లాడకుంటే మన పిల్లలు క్షమిస్తారా?
- ఏపీపై ఇక్కడి మీడియా రాస్తే.. అది ఎల్లో జర్నలిజమంటారు..
- జాతీయ మీడియాలో రాశారు దానికేమంటారు?
అమరావతి పరిరక్షణ 5 కోట్ల ప్రజల సమష్టి బాధ్యతని, మూడు రాజధానుల ప్రతిపాదనను ఒప్పుకుంటే భావి తరాలకు అన్యాయం చేసిన వారమవుతామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూడు రాజధానుల ప్రతిపాదనను అడ్డుకోవడం ప్రజలందరి సమష్టి బాధ్యత అన్నారు. ప్రజల్లో చైతన్యం రావాల్సి ఉందన్నారు.
మనం ఇప్పుడు మాట్లాడకపోతే మన పిల్లలు క్షమిస్తారా? అన్న విషయం ఆలోచించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఇక్కడ రాసిన వార్తలను ఎల్లో జర్నలిజం, కుల పక్షపాతంతో రాశారంటూ విమర్శిస్తారని, మరి జాతీయ మీడియాలో రాశారు.. దానికి మీరు ఏమంటారని అధికార వైసీపీ నేతల నుద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. ఈ సందర్భంగా పలు జాతీయ పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో రాసిన కథనాలను చంద్రబాబు ప్రస్తావించారు.