Chandrababu: ‘ఒక రాష్ట్రం..ఒక రాజధాని’ కోసమే రైతులు భూములిచ్చారు: చంద్రబాబునాయుడు

  • అమరావతి గ్రీన్ ఫీల్డ్ రాజధానుల్లో ఒకటి
  • జేఏసీ ఛైర్మన్ గా ఎంపికైన జీవీఆర్ శాస్త్రికి శుభాకాంక్షలు తెలిపిన బాబు 
  • ఆయన ఉద్యమాన్ని సరైన దిశలో తీసుకెళతారన్న టీడీపీ అధినేత 

  గ్రీన్ ఫీల్డ్ రాజధానుల్లో అమరావతి ఒకటని, పచ్చదనంతో రాణించే రాజధానిగా తనకు తానే సాటిగా మిగిలిపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అది ఆంధ్రప్రదేశ్ స్థాయిని పెంచడమేకాక రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ బలోపేతం చేస్తుందన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ పోరాడుతున్న జేఏసీకి ఛైర్మన్ గా నియామకమైన జీవీఆర్ శాస్త్రికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్లో సందేశాన్ని పోస్ట్ చేస్తూ.. జీవీఆర్ శాస్త్రి సరైన దిశలో ఉద్యమాన్ని తీసుకెళతారన్న విశ్వాసముందన్నారు. రాజధానికోసం రైతులు చేసిన త్యాగాన్ని, రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ.. రై తులతో కలిసి  మహిళలు, పిల్లలు వీధుల్లో చేస్తోన్న నిరసనను శాస్త్రి దేశ ప్రజల దృష్టికి తీసుకుపోతారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

‘అమరావతి పచ్చదనంతో కూడిన రాజధాని. అది రాజధానిగా ఉంటే రాష్ట్రం అన్ని రంగాల్లో బలోపేతమవుతుంది. అంతేకాక, దేశ జాతీయ ఆదాయం పెరగడానికి వృద్ధి ప్రేరకంగా ఉంటుంది.  అభివృద్ధి ప్రక్రియలో అమరావతి తన నిధులు తానే సమకూర్చుకుంటూ.. ప్రపంచంలో ఉత్తమ మోడల్ గా నిలుస్తుంది’ అని అన్నారు. వేలకొద్దీ రైతులు స్వచ్ఛందంగా ముందుకువచ్చి రాజధానికి 32,000 ఎకరాల భూములను సమకూర్చారని, వారి త్యాగం ‘ఒక రాష్ట్రం ఒక రాజధాని కోసమే’ కానీ, మూడు రాజధానుల కోసం కాదని అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని హెచ్చరించారు.

Chandrababu
Telugudesam
Amaravati
JAC
chairman GVR Shastri
  • Loading...

More Telugu News