Vadde Shobhanadreeshwararao: ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నా... ఇన్నిరోజులు సాగిన ఉద్యమం ఎక్కడా చూడలేదు: వడ్డే శోభనాద్రీశ్వరరావు
- తుళ్లూరు వచ్చిన శోభనాద్రీశ్వరరావు
- రైతులకు, వారి కుటుంబసభ్యులకు సంఘీభావం
- విపక్షాలకు పేరొస్తుందని అన్నీ నిలిపేస్తే ఎలా? అంటూ ఆగ్రహం
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రాజధాని రైతుల పోరాటానికి మద్దతు పలికారు. తుళ్లూరులో మహాధర్నాను సందర్శించిన ఆయన రైతులకు, వారి కుటుంబ సభ్యులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను ఎన్నో వ్యవసాయ రంగ ఉద్యమాలను చూశానని, ఎక్కడా ఇన్నిరోజుల పాటు సాగిన ఉద్యమం చూడలేదని, నూటికి నూరుశాతం రాజధాని అమరావతిలోనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
సీఎంగా అధికారం చేపట్టాక జగన్ అందరినీ కలుపుకుని పోవాలని, అలాకాకుండా ప్రత్యర్థి పార్టీకి పేరొస్తుందని అన్ని కార్యక్రమాలు నిలిపివేయడం విచారకరం అని వ్యాఖ్యానించారు. అమరావతి ఎంపిక అందరి ఇష్టాలకు అనుగుణంగానే జరిగిందని, కానీ సీఎం జగన్ మాత్రం ఇష్టానుసారం వ్యవహరిస్తూ అనిశ్చితి సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణం కోసం రూ.1632 కోట్లు ఖర్చయిందని కేంద్రానికి తెలిపాక కూడా విశాఖకు రాజధాని తరలించడమేంటని ప్రశ్నించారు. హైకోర్టు తరలింపునకు ఎవరి అంగీకారంతోనూ పనిలేదా? అంటూ నిలదీశారు.