Madhavi Latha: నన్ను ఎంతో ఇబ్బంది పెడుతూ జీవచ్ఛవంలా మార్చిన సమస్యతో పోరాడుతున్నా: మాధవీలత
- ఫేస్ బుక్ లో మాధవీలత పోస్టు
- మానసిక సమస్యలతో బాధపడ్డానని వివరణ
- ఇటీవలే డిప్రెషన్ నుంచి బయటికి వచ్చానని వెల్లడి
ఇటీవల చచ్చిపోతున్నానంటూ సినీ నటి మాధవీలత పెట్టిన పోస్టు తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే ఆ పోస్టుపై వివరణ ఇచ్చిన మాధవీలత మరోసారి స్పందించింది. సుదీర్ఘకాలం మందులు వాడి విరక్తి చెందడంతో పెట్టిన పోస్టు తెల్లారేసరికి పెద్ద న్యూస్ లా మారిపోతుందని కలలో కూడా ఊహించలేదని పేర్కొంది. గత కొంతకాలంగా తన పరిస్థితి చాలా భయంకరంగా ఉందని, డిప్రెషన్ లోకి వెళ్లడంతో కొందరు స్నేహితులతో కలిసి ఆశ్రమాలకు వెళ్లానని మాధవీలత ఫేస్ బుక్ లో వెల్లడించింది.
చావాలి అనే ఆలోచన ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని, దీపికా పదుకొనే వంటివాళ్లు కూడా ఇలాంటి మానసిక సమస్యలతో బాధపడ్డారని వివరించింది. పూజలు, ధ్యానం ఇలా ఎన్నో చేసినా ఫలితం కనిపించక కుంగిపోయానని, మానసిక వేదనకు గల కారణాలు మా అమ్మకు, ఫ్రెండ్స్ కు మాత్రమే చెప్పాను తప్ప అభిమానులతో పంచుకుని వారిని బాధించాలనుకోలేదని మాధవీలత తెలిపింది. ఓ దశలో 3 నెలల పాటు పిచ్చిదానిలా మారిపోయి ప్రతిరోజూ ఏడ్చేదాన్నని వివరించింది. ఈ సంక్రాంతి పండుగతో తన జీవితంలో కొంత ఊరట లభించిందని, డిప్రెషన్ నుంచి బయటికి వచ్చానని పేర్కొంది.
నా సమస్యపై నేను పోరాడిన విధానాన్ని అందరితో పంచుకోవాలని పోస్టు చేస్తే నా చావు నేనే పోస్ట్ చేశాను అన్నట్టుగా పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ ఇలాంటి సమస్యలు చాలామందిలో ఉండడం సహజమే అయినా, నన్ను ఎంతో ఇబ్బందిపెడుతూ, నన్ను జీవచ్ఛవంలా మార్చేసిన ఈ సమస్యతో ఇప్పటికీ పోరాటం చేస్తున్నా అంటూ వివరించింది. పీసీఓడీ, మైగ్రేన్, ఇన్ సోమ్నియా, వ్యాధినిరోధకశక్తి లేమితో పోరాడుతున్నానని వెల్లడించింది.